అసెంబ్లీలో తెరుచుకున్న గేట్-2 - గోడను కూల్చివేయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు - Speaker opened Gate 2 - SPEAKER OPENED GATE 2
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 10:44 PM IST
Assembly Gate Two was Opened by Speaker Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీలో మూసేసిన రెండో నెంబరు గేటును అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వాస్తు పేరు చెప్పి రెండో గేటుని మూసేశారు. గేటు దగ్గర గోడ నిర్మించి రాకపోకలు ఆపేశారు. దీంతో అసెంబ్లీ గేటు-2 గోడను సభాపతి అయ్యన్నపాత్రుడు పడగొట్టించారు. గేట్-2 నుంచి ఎవ్వరూ రాకుండా జగన్ కట్టిన గోడని తొలగించి, గేటుని తెరిపించారు. రాకపోకలకు అనువుగా మార్గాన్ని సిద్ధం చేశారు. అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాసౌమ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి రెడ్డి గేటు-2 ని మూసి, గోడ కట్టించారని మండిపడ్డారు.
ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అయ్యన్న స్పష్టం చేశారు. ప్రజాసామ్య వ్యవస్థలో దేవాలయంగా భావించే శాసనసభ గేట్లు తెరిచే ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాసౌమ్య ప్రభుత్వమని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడున్నది ప్రజా అసెంబ్లీ అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.