సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల ఆందోళన - APSRTC Employees
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 7:36 PM IST
APSRTC Employees Protest in Nellore District : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు ఉపయోగపడే విధంగా వారి ఒత్తిడిని తగ్గించి మెరుగుపరిచేందుకు 01/2019 సర్క్యులర్‌ను తీసుకువచ్చిందని తెలియజేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తరవాత కొంత మంది స్వార్థపరులు యాజమాన్యాన్ని తప్పుదోవ పట్టించడం వల్ల అది అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
ఆర్టీసీ యాజమాన్యం 01/2019 సర్క్యులర్‌ను పక్కన పెట్టి 70/71 సర్క్యులర్‌ను అమలు చేయడం దారుణమని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. 70/71 సర్క్యులర్‌ను అమలు చేయడం వల్ల రాష్ట్రంలో 200 మంది, నెల్లూరు జిల్లాలో 21 మంది దాకా సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. కార్మికులను అభద్రత భావానికి గురి చేసే 70/71 సర్క్యులర్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సర్క్యులర్ వల్ల కార్మికులపై పని ఒత్తిడి పెరుగుతుందని వాపోతున్నారు. 01/2019 సర్క్యులర్‌ను అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరుకున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.