మత్స్యకారులకు ద్వారంపూడి, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి : ఏపీ ఫిషర్మెన్ జేఏసీ - Fishermen JAC fire on Dwarampudi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 7:51 PM IST
AP Fishermen JAC Fire on YCP Mla MLA Dwarampudi Chandrasekhar Reddy : మత్స్యకారులను అవమానపరిచిన కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బేషరతుగా మత్స్యకార జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో జేఏసీ ఛైర్మన్ సైకం రాజశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, మత్స్యకార జాతి అమ్ముడుపోయే జాతిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార ఓట్లతో గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని హేళన చేస్తూ, అవమాన పరచడం దారుణమన్నారు.
ద్వారంపూడి నోరు అదుపులో పెట్టుకోక పోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇలాగే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి కడతామని తెలిపారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడురోజులైన ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని మండిపడ్డారు. ద్వారంపూడి ఈ వ్యాఖ్యలు చేయడానికి వెనకాల ప్రభుత్వ హస్తం కూడా ఉండవచ్చని అనుమాన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. వెంటనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.