Minister Lokesh Davos Tour : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు దావోస్‌లో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సాయం, అమరావతి, విశాఖ, తిరుపతిల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల నిర్మాణం, మెరుగైన ఆరోగ్య ప్రమాణాల కోసం శిక్షణ వంటి రంగాల్లో సహకారం అందించాలని వివిధ రంగాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది.
హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో సమావేశమైన మంత్రి నారా లోకేశ్ సమర్థవంతమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్‌వీడీసీ వంటి అధునాతన సాంకేతికత అమలుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో 3 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌లను కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను పునఃపరిశీలించాలని కోరారు. వాటిని అమలు చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భరత్ కౌశల్ హామీ ఇచ్చారు. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే వ్యవస్థలను హిటాచీ అభివృద్ధి చేస్తుందని వివరించారు.
Lokesh Meets WTC Chairman : అనంతరం లోకేశ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ ఛైర్మన్ జాన్ డ్రూతో భేటీ అయ్యారు. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్‌ను అనుసంధానించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌లో ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూటీసీఏ నెట్‌వర్క్, ట్రేడ్ ఈవెంట్‌ల ద్వారా చిన్నతరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ కోసం సహకారం అందించాలని కోరారు.
ప్రస్తుతం భారత్‌లో 13 ప్రపంచ వాణిజ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని జాన్ డ్రూ తెలిపారు. ఇందులో 7 నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతీయ వ్యాపారాలు, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇండియా బేస్డ్ ట్రేడ్ హబ్‌లను ప్రాంతీయ మార్కెట్లకు అనుసంధానించాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు సహకారం అందించాలని డబ్ల్యూఈఎఫ్ను లోకేశ్ కోరారు. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌ను కలిసిన ఆయన స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను సాధించేందుకు ఏపీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు ఇవ్వాలని సూచించారు. క్యాన్సర్, డయాబిటిక్ రెటినోపతి వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రోగనిర్ధారణ అల్గారిథమ్‌లలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
ప్రతిపాదనలను పరిశీలిస్తాం : ఆంధ్రప్రదేశ్‌లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవలను ప్రారంభించాలని లోకేశ్ కోరారు. భారత్‌లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నందున, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐ, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగించాలని యోచిస్తున్నట్లు డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
దావోస్‌లో మంత్రి లోకేశ్ బిజీబిజీ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం: నారా లోకేశ్