కొలిక్కి రాని లెక్కలు - బడ్జెట్‌పై అధికారుల తర్జన భర్జన - AP Assembly Sessions - AP ASSEMBLY SESSIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 9:59 PM IST
AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులు తర్జన భర్జనపడుతున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలా లేక రెండు మూడు నెలలకు పెట్టాలా అనే దానిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మాదిరిగా తప్పుడు లెక్కలతో బడ్జెట్ పెట్టొద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో వివరాలు సరిగా లేకుంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమని అధికారులు భావిస్తున్నారు.
ప్రతి శాఖలో లెక్కలు చాలా దారుణంగా ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. వివిధ శాఖల ఖాతాల్లో లెక్కలు కొలిక్కి రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ లెక్కలన్నీ ఇప్పటికిప్పుడు కొలిక్కి రావడం కష్టమంటున్నారు. కేంద్ర బడ్జెట్ చూశాక పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి విషయాల్లో స్పష్టత వచ్చాకే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడమా లేదంటే రెండు మూడు నెలలకు బడ్జెట్ పెట్టాలా అన్నదానిపై మీమాంస కొనసాగుతోంది.