కడప విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై అవినీతి ఆరోపణలు - విచారణకు ప్రభుత్వం ఆదేశం - AP Govt Inquiry RJD Raghava Reddy - AP GOVT INQUIRY RJD RAGHAVA REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 29, 2024, 10:49 PM IST
AP Govt Inquiry on RJD Raghava Reddy : కడప విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆర్జేడీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. ఇందుకోసం విచారణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ ప్రసన్నను నియమించింది.
Kadapa RJD Raghava Reddy Irregularities : ఆర్జేడీ రాఘవరెడ్డి గతంలో డీఈవోగా పని చేస్తున్న సమయంలో వైసీపీ నేతలతో అంటకాగుతూ విధులు నిర్వర్తించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధ్యాయులను దూషించడం, మహిళా ఉపాధ్యాయినులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని ఇష్టానుసారంగా బదిలీలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లేకుండా లంచాలు తీసుకుని బదిలీలు, డిప్యుటేషన్లు చేయడమే కాకుండా వీటిపై ప్రశ్నించిన వారిని విధుల నుంచి తొలగించారని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించకున్నా రాఘవరెడ్డి అనుమతులిచ్చారని భూమిరెడ్డి తెలిపారు. 2023, మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా పని చేశారని చెప్పారు. ఆయన తీరుపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే తన అంతు చూస్తానని ఆర్జేడీ బెదిరించారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాఘవరెడ్డి కోట్లాది రూపాయలు వసూలు చేసి అక్రమ బదిలీలు చేశారని అని భూమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.