గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు చర్యలు: సీఎం జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 7:52 PM IST
Andhra Pradesh CM Jagan Launches Cell Towers: మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం సేవలు సమర్థవంతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రానున్న నెల రోజుల్లో మరో 2,400 టవర్లను తీసుకొస్తామన్నారు. దాదాపు 2900 టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా, కనెక్టివిటీ లేని 5,459 ఆవాసాలను కనెక్టివిటీలోకి తీసుకొస్తామని తెలిపారు. దీనికోసం సుమారు 3119 కోట్లతో కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. టవర్లు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసాలు అనుసంధానమవుతాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకు 400 టవర్లును దాదాపుగా రూ. 400 కోట్ల పెట్టుబడితో నిర్మించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రారంభిస్తున్న 300 టవర్లతో, మరో 2 లక్షల మంది జనాభాకు ప్రయోజనం కలిగనుందని, 944 గ్రామాలు వీటి ద్వారా కనెక్ట్ అవుతున్నాయన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం సాంకేతిక సమాచారం వ్యవస్థను అందుబాటులోకి వస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.