యూనిఫాం తీసేసి రైలు కిందపడి ఏఎస్ఐ బలవన్మరణం - ASI suicide - ASI SUICIDE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 10:54 AM IST
|Updated : Jul 3, 2024, 11:55 AM IST
ASI Suicide in YSR Kadapa District : వైయస్సార్ జిల్లాలో ఓ ఏఎస్ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనారోగ్య కారణాలే అందుకు కారణమని తెలుస్తోంది. డ్యూటీ ముగించుకున్న అనంతరం రైలు పట్టాల వద్దకు వెళ్లి యూనిఫాం విడిచి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల ప్రకారం వైయస్సార్ జిల్లా వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగార్జున రెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
నాగార్జున రెడ్డి అనారోగ్య సమస్య వల్లే మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రైలు పట్టాల వద్దకు తన ద్విచక్ర వాహనంపై వెళ్లిన నాగార్జున రెడ్డి సెల్ఫోన్ అక్కడే ఉంచి యూనిఫామ్ తీసి పక్కన పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల కూడా ఆయన కాలు నొప్పితో అనారోగ్యంగా ఉండి బాధపడుతూ ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. నాగార్జునరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు.