రాజధానిపై జగన్ విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాడు- అమరావతి రైతుల ఆగ్రహం - Amaravati Farmers on Floods - AMARAVATI FARMERS ON FLOODS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2024, 5:42 PM IST
Amaravati Farmers on Floods: రాజధానిలో వరదలు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతల తీరుపై అమరావతి ఐకాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నలభై ఏళ్లల్లో ఇంత భారీ వర్షం కురవలేదని రైతులు చెప్పారు. ఐదేళ్లు అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయని మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన అనుచరులు, వారికి వత్తాసు పలికే మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమాలపైనే దృష్టి సారించిందని రైతులు చెప్పారు.
ప్రకృతి విపత్తుకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, రాజధానిపై విష ప్రచారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఏ వాగు ఎక్కడ ఉందో వైఎస్సార్సీపీ నేతలకు తెలుసా అని నిలదీశారు. వరదలు వస్తే ఆ పార్టీ నాయకులు హైకోర్టుకు ఎలా వచ్చారని, వాళ్ల బెయిల్ పిటిషన్ కొట్టేయలేదా అని ప్రశ్నించారు. అన్ని కార్యాలయాలు తన పనులు కొనసాగిస్తుంటే కొంతమంది విష ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, వారికి చెందిన మీడియా రాజధానికి వచ్చి ఎక్కడ వరద వచ్చిందో చూపించాలని సవాలు విసిరారు. లేదంటే తమ దగ్గరికి చర్చకు వచ్చినా తాము సిద్ధమని రైతులు ప్రకటించారు.