లంచం తీసుకునేందుకు కింది స్థాయి ఉద్యోగిని నియమించిన అధికారిణి- ఏసీబీకి రెడ్ హ్యాండ్‌గా పట్టుబడిన వైనం - Dist Malaria Officer
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 8:10 PM IST
|Updated : Jan 30, 2024, 10:51 PM IST
ACB Rides in Prakasham District : ప్రకాశం జిల్లాలో ఏసీబీ వలకి జిల్లా మలేరియా అధికారితో పాటూ అసిస్టెంట్ అధికారి చిక్కిన ఘటన నగరంలో కలకలం రేపింది. పీఆర్సీ ఎరియర్స్ బిల్లలు మంజూరుకి రూ.లక్షా 40వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దోర్నాలలో మల్టీ పర్పస్ హెల్త్ సూపర్ వైజర్‌గా పని చేస్తున్న ఇజ్రాయేలుకి 2015 నుంచి 2021 వరకూ పీఆర్సీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల విడుదల కోసం జిల్లా మలేరియా అధికారిణి జ్ఞానశ్రీకి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రూ.16,86,103 పెండింగ్ బిల్లులు మంజూరు కోసం రూ. 4 లక్షలు లంచం డిమాండ్ చేసింది జ్ఞానశ్రీ.
Malaria Officer Bribe News : అంత డబ్బు ఇచ్చుకోలేనన్నా ఇజ్రాయేలు బేరం ఆడగా చివరికి రూ. లక్షా 40వేలు తీసుకునేందుకు అంగీకరించింది. అయిన లంచం ఇవ్వడం ఇష్టం లేని ఇజ్రాయేలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు జ్ఞానశ్రీని రెడ్ హ్యాండ్‌గా పట్టుకునేందుకు వలపన్నారు. అయితే లంచం నగదు తీసుకురావాలని అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసరావుని జ్ణానశ్రీ పంపించింది. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం జిల్లా మలేరియా అధికారిణి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇద్దరినీ అరెస్టు చేసిన అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.