పొలం వివాదం : ట్రాక్టర్‌తో ఢీకొట్టి దళిత మహిళ హత్య - Dalit woman murder - DALIT WOMAN MURDER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 5:35 PM IST
A Dalit Woman was Killed by Tractor in Kurnool District : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పొలం వివాదంలో ఓ దళిత మహిళను ప్రత్యర్థులు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని ఆదోని మండలం నాగనాథన హళ్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగనాథహళ్లి గ్రామానికి చెందిన గుండమ్మ(50) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు ఈరోజు ఉదయం పొలం విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆ వ్యక్తులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి మహిళను హతమార్చారు. మహిళపై దాడి చేస్తుండగా అడ్డువచ్చిన పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తిపై కూడా నిందితులు దాడి చేశారు.
దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తొలుత ఆదోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళపై దాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పొలంలో పని చేస్తుంటే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డుకుని ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యుడు రవి తెలిపారు.