GOVT TO PREVENT BUDAMERU FLOOD: బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణలు సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. రాబోయో రోజుల్లో విజయవాడకు వరద ఇబ్బందులు లేకుండా నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న అంశం ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చించారు. బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
సమాంతరంగా కొత్త కాల్వ: బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా, పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. బుడమేరు ఛానెల్‌కు సమాంతరంగా ఓల్డ్ ఛానెల్‌ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. గత టీడీపీ హాయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ 35 వేల క్యూసెక్కులకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80 శాతం పనులు పూర్తి చేశామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20 శాతం పనులకు సంబందించి తట్ట మట్టిగానీ, బస్తా సిమెంట్ పని గానీ చేయలేదని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన పాపం ఫలితమే బుడమేరు ముంపునకు కారణమన్నారు.
గత టీడీపీ హయాంలో ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు ఛానెల్‌కు సమాంతరంగా ఓల్డ్ ఛానెల్‌ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం సూచనలకు అనుగుణంగా బుడమేరు యాక్షన్ ప్లాన్‌కు రంగంలోకి దిగుతామని, బుడమేరు వరదల నియంత్రణకు కేంద్రం సహకారం కోరతామని స్పష్టం చేశారు.
బుడమేరు వరదల వల్ల 34 వార్డులలో 5లక్షల మంది 4 రోజులు నీళ్లలోనే ఉన్నారని, కనీసం రోజు వారీ అవసరాలకు కూడా నీరు అందని పరిస్దితి ఉందని మంత్రి నారాయణ అన్నారు. ప్రజల అవసరాలకు రోజుకు 20 నుంచి 30 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని, దీనిపై కూడా వైఎస్సార్సీపీ రాజకీయం చేసిందని దుయ్యబట్టారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్దితి వచ్చేది కాదన్నారు. బుడమేరు వరదలకు వైఎస్సార్సీపీనే కారణమని ధ్వజమెత్తారు.
జనవరి 18న మరోసారి ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖలు సమావేశం అవుతామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరు కాలువపై 3750 ఆక్రమణలు ఉన్నాయన్నారు. నగర పరిధిలో ప్రవహించే బుడమేరు కాలువ లోతు వెడల్పు విషయంలో అధ్యయనం చేస్తున్నామన్నారు. కాలువ సామర్థ్యం పెంచితే వరద నీటి ప్రవాహం బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. బుడమేరు కాలువతో పాటు దిగు ప్రాంతంలో రైల్వే కట్టల వల్ల కూడా నీరు వెళ్లకుండా నిలిచిపోయిందన్నారు. ఈ నివేదిక సిద్ధమయ్యాక రైల్వే వాళ్లతో కూడా చర్చించి ద్వారా నీరు ప్రవాహ మార్గాలపై కార్యాచరణ చేపడతామన్నారు.
అక్రమ నిర్మాణాలపై ఫోకస్ - ఎంతటివారైనా ఉపేక్షించం: మంత్రి నారాయణ - Narayana on Operation Budameru