OnePlus 12R Refund : వన్‌ప్లస్ నుంచి కొత్తగా లాంచ్ అయిన 12ఆర్ మొబైల్ కొనుగోలు చేసిన వాళ్లకు పూర్తి డబ్బును తిరిగి ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంచింగ్ సమయంలో స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ స్టోరేజీపై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సదుపాయం మార్చి 16 వరకు ఉంటుందని వన్‌ప్లస్ కంపెనీ సీఓఓ ప్రకటించారు.
వన్‌ప్లస్ కంపెనీ గత నెలలో 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. అందులో 16జీబీ + 258 జీబీ వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 8జెన్ 2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనివర్సల్ ప్లాష్ స్టోరేజ్(UFS) 4.0 స్టోరేజీ కలిగి ఉంటుందని కంపెనీ లాంచింగ్ సమయంలో ప్రకటించింది.
తాజాగా ఈ వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ విషయంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. వన్‌ప్లస్ 12ఆర్ హై స్టోరేజీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్స్ నిజానికి UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చాయని, లాంచింగ్ సమయంలో తప్పుగా ప్రకటించామని సంస్థ ధ్రువీకరించింది. దీంతో వన్‌ప్లస్ 12ఆర్ 256జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసినవారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు వన్‌ప్లస్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి తెలుసుకోవాలని సంస్థ సీఓఓ కిండర్ లియు సూచించారు.