Flying Taxis Launch:ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా వేధిస్తోంది. నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఎన్ని ఫ్లై ఓవర్లు, స్కై వేలు, హై వేలు, అండర్‌పాస్‌లు నిర్మించినా పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిద్ధమైంది.
త్వరలోనే ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది. దీంతో ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు తీవ్రమైన రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి రిలీఫ్ లభించనుంది.
ఈ నేపథ్యంలో తక్కువ ఎత్తులో పర్యావరణరహిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు విషయాన్ని కంపెనీ సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ సిటీ.. ఇలా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది.