Pinaka Weapon System: రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో దూసుకుపోతున్న DRDO తాజాగా గైడెడ్ పినాక వెపన్ సిస్టమ్ ఫ్లైట్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ బలం మరింత పెరగనుంది. ప్రొవిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్‌మెంట్స్ (PSQR) వాలిడేషన్ ట్రయల్‌లో భాగంగా వివిధ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లలో ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
సమాచారం ప్రకారం..మూడు దశల్లో వివిధ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లలో ఫ్లైట్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలో రాకెట్ ప్రయోగ సామర్థ్యం, ఖచ్చితత్వం, స్థిరత్వంతో పాటు ఫైరింగ్ రేట్‌ను లెక్కించారు. డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెస్ట్ చాలా కీలకమైనది. ఈ పినాక ఆయుధ వ్యవస్థను భారత సైన్యంలోకి చేర్చడానికి ముందు పరీక్షించిన చివరి దశ ఇది.
ఈ దశలో రాకెట్ రేంజ్, ఖచ్చితత్వం, స్థిరత్వంతో పాటు మల్టిపుల్ టార్కెట్స్పై ఏకకాలంలో దాడి చేయగల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఇందుకోసం రెండు పినాక లాంచర్లను ఉపయోగించారు. ఈ విజయం తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO, భారత సైన్యాన్ని అభినందించారు. గైడెడ్ పినాకా వెపన్ సిస్టమ్ సాయుధ బలగాల మందుగుండు శక్తిని మరింత పెంచుతుందని ఆయన అన్నారు.
ఈ పరీక్షలో పాల్గొన్న టీమ్స్‌ను DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) చీఫ్ డాక్టర్ సమీర్ వి.కామత్ అభినందించారు. ఈ రాకెట్ సిస్టమ్‌ను భారత సైన్యంలోకి చేర్చడానికి ముందు అవసరమైన అన్ని ఫ్లైట్ టెస్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన చెప్పారు.