Chakshu portal Launch :టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'డీఐపీ' (DIP), 'చక్షు' (Chakshu) అనే రెండు సరికొత్త పోర్టల్‌లను ప్రారంభించింది. ఈ రెండూ టెలికమ్యునికేషన్ విభాగం (DoT) ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
DIP Portal :డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం (డీఐపీ) అనేది ఒక బ్యాకెండ్ మాడ్యూల్. ఇది బ్యాంకులు, ఫోన్‌పే వంటి యూపీఐ పేమెంట్స్ యాప్‌లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా కంపెనీలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తుంది. అలాగే డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య కూడా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసి సైబర్ క్రైమ్స్‌ను అరికట్టేందుకు సహకరిస్తుంది.
ఉదాహరణకు ఒక ఫోన్ నంబర్‌ను సైబర్ ఫ్రాడ్ కోసం ఉపయోగిస్తున్నారని అనుకుందాం. అప్పుడు 'డీఐపీ అనేది పైన పేర్కొన్న అన్ని డిపార్ట్మెంట్లకు ఈ విషయాన్ని ఒకేసారి పంపిస్తుంది. దీనితో సదరు ఫోన్ నంబర్‌ను అన్ని ప్లాట్‌ఫామ్‌లు ఒకేసారి బ్లాక్ చేయడానికి వీలవుతుంది.
అయితే ఈ డీఐపీ పోర్టల్ అనేది సాధారణ పౌరులకు అందుబాటులో ఉండదు. కానీ 'చక్షు' యాప్‌లో సాధారణ పౌరులు చేసే ఫిర్యాదులను బ్యాకెండ్‌లో సమీక్షిస్తుంది.
Chakshu Portal : సైబర్ మోసాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 'చక్షు' (హిందీలో కన్ను అని అర్థం) అనే పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలు తమకు వచ్చిన అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసెజ్‌లు గురించి ఇందులో రిపోర్ట్ చేయవచ్చు.