Centre Issues Advisory Fraud Calls : దేశ పౌరులకు శుక్రవారం అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర సమాచార శాఖ. మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేస్తామంటూ తమ పేరుతో పౌరులకు బెదిరింపు సందేశాలు పంపుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని డాట్ హెచ్చరించింది. యుజర్ల నంబర్లను కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా విదేశీ నంబర్ల (ఉదాహారణ : +92-xxxxxxxxxx వంటివి) నుంచి వాట్సాప్ కాల్స్ చేస్తూ, తాము ప్రభుత్వాధికారులమంటూ మోసం చేస్తున్నారని పేర్కొంది.
ఇలాంటి మోసపూరిత కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైమ్/ ఆర్థిక నేరాలకు పాల్పడేందుకు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి ఇలాంటి కాల్స్ చేసేందుకు ఎలాంటి అనుమతి ఉండదని తెలిపింది. ఎవరు ఫోన్ చేసినా ఎలాంటి సమాచారాన్ని వారికి చెప్పకూడదని సూచించింది.
ఇలా ఫిర్యాదు చేయండి
ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినప్పుడు సంచార్ సాథీ- చక్షు పోర్టల్‌లో నివేదించాలని డాట్ సూచించింది. ఇలా చేయడం వల్ల సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని చెప్పింది. ఇక ఈ పోర్టల్‌లో ఎవరి పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ అందులో ఏదైనా కనెక్షన్ మీరు తీసుకోకుంటే రిపోర్ట్ చేయొచ్చని చెప్పింది. అంతేకాకుండా ఏదైనా సైబర్ క్రైమ్ గురించి రిపోర్ట్ చేయడానికి 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయొచ్చని వెల్లడించింది. సైబర్ క్రైమ్ బాధితులు www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని చెప్పింది.