iphone 16 Delivery in 10 Minutes: యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సేల్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూవీ రిలీజ్ రోజు టికెట్ల కోసం యుద్ధం చేసినట్లుగా వీటి కోసం కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు యాపిల్ స్టోర్‌ల ముందు పెద్దఎత్తున క్యూలు కట్టారు. ఈ నేపథ్యంలో ఈ మొబైల్స్ వేగవంతమైన డెలివరీలపై టాటాగ్రూప్ సరికొత్త ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఐఫోన్ 16ను కేవలం పది నిమిషాల్లో కస్టమర్లకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఇందుకోసం తమ నిత్యావసరాల సరఫరా యాప్ బిగ్ బాస్కెట్‌ను రంగంలోకి దించింది. వీటిని నిమిషాల్లో డెలివరీ చేయించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేయనుంది. మొత్తం మీద 10 నిమిషాల్లో కస్టమర్ చేతికి ఐఫోన్ 16 అందించనున్నారు. కస్టమర్లకు ఐఫోన్ 16 వేగవంతమైన డెలివరీపై బిగ్‌బాస్కెట్ సీఈవో హరి మేనన్ మాట్లాడారు. యాపిల్ కస్టమర్లు అత్యాధునిక టెక్నాలజీని ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఎంజాయ్ చేసేలా చేస్తామని తెలిపారు.
"ఎలక్ట్రానిక్ విభాగంలో మా ప్రస్థానానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అత్యంత వేగంగా వస్తువులు డెలివరీ చేయడంతోపాటు మేము.. మా కస్టమర్లు అత్యాధునిక టెక్నాలజీని ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఎంజాయ్ చేసేలా చేస్తాం. త్వరలోనే అడ్వాన్స్డ్ ఎలాక్ట్రానిక్ డివైజెస్‌ను అందుబాటులోకి తెస్తాం." - హరి మేనన్, బిగ్‌బాస్కెట్ సీఈవో
ఈ సేవలు ఎప్పటి నుంచి?
- ఎంపిక చేసిన నగరాల్లో నేటినుంచి టాటా గ్రూప్ ఈ సేవలను మొదలుపెట్టింది.
- ప్రస్తుతం ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయిల్లో ఈ సేవలు మొదలయ్యాయి.
- కాకపోతే ఇప్పటివరకు ఈ మోడల్ ఫోన్లపై ఆఫర్లను బిగ్‌బాస్కెట్ ప్రకటించలేదు.