New Honda Amaze Launched:జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా.. కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ అప్డేటెడ్ వెర్షన్ అమేజ్‌ను అదిరే డిజైన్‌లో స్టన్నింగ్ లుక్‌తో తీసుకొచ్చింది. కంపెనీ ఈ కారును రూ.7,99,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే హోండా.. ఈ కారులో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ను అందించింది. ఈ ADAS ఫీచర్‌తో వచ్చిన దేశంలోనే అత్యంత చౌకైన కారుగా హోండా అమేజ్ గుర్తింపు పొందింది.
వేరియంట్స్: హోండా అమేజ్ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
- V
- VX
- ZX
ఎక్స్టీరియర్ డిజైన్: ఈ కొత్త అమేజ్ ఫ్రంట్ ఎండ్ కంపెనీ కాంపాక్ట్ SUV, హోండా ఎలివేట్‌ను పోలి ఉంటుంది. ఇది దీర్ఘచతురస్రాకార గ్రిల్, హోండా అకార్డ్ మాదిరిగానే బంపర్ డిజైన్‌తో వస్తుంది. ఈ కారు'హోండా సిటీ' మాదిరిగా మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, ర్యాప్‌రౌండ్ టెయిల్ లైట్లను కూడా కలిగి ఉంది. ఈ కారులో LED DRLలతో కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను అమర్చారు. ఇవి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో రోడ్డుపై వస్తున్న వాహనాలను క్లియర్‌గా చూసేందుకు సహాయపడతాయి.
ఇంటీరియర్ డిజైన్:ఈ అప్డేటెడ్ అమేజ్ వెర్షన్ ఇంటీరియర్ డిజైన్.. హోండా సిటీ సెడాన్, ఎలివేట్ SUV మోడల్ మాదిరిగా ఉంటుంది. ఈ కొత్త మోడల్లో సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. అంతేకాక ఇందులో ఎయిర్ కండీషనర్ వెంట్స్ కూడా ఉన్నాయి.
దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అమేజ్ హోండా సిటీ, ఎలివేట్ మాదిరిగానే ఉంటుంది. దీని క్యాబిన్లో డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఇంటిగ్రేటెడ్ కప్ హోల్డర్‌లతో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, వెనక AC వెంట్, ముగ్గురు ప్రయాణీకులకు హెడ్‌రెస్ట్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లతో వస్తుంది. దీనిలోని అన్ని సీట్లూ స్టాండర్డ్‌గా థ్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లతో వస్తున్నాయి.