YSRCP MLA Balineni Srinivas Reddy : నిన్న మొన్నటి వరకూ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే వైఎస్సార్సీపీలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రాధాన్యం ఉన్న నాయకుడు. జిల్లాలో ఆయన మాటే శాసనంగా సాగేది. జిల్లాలో టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి చెక్ పెట్టాలనే విషయాల్లో బాలినేనిదే పైచేయిగా ఉండేది. అలాంటి బాలినేని గత రెండున్నరేళ్లుగా అసహనంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఎవరిమీదో ఉన్న కోపం ఇంకెవరిమీదో చూపిస్తున్నట్లుగా ఉందని సొంత పార్టీ శ్రేణులే చెప్పుకొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే బాలినేని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పదవి ఉన్నన్నాళ్లు ఆయనదే హవా : ఆ పదవి ఉన్నన్నాళ్లూ జిల్లాలో ఆయనదే హవా అన్నట్లు సాగింది. ఈ క్రమంలో ఆయనపై వివాదాలు అలముకున్నాయి. పదవిని అడ్డుపెట్టుకుని అనేక వ్యవహారాల్లో ఆయనే కీలకంగా వ్యవహరించడంతో పాటు తన వియ్యంకుడు, అతని అనుచరులు నడిపిన దందాలకు లెక్కేలేదు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట వద్ద కుమ్మర్ల స్థలాన్ని కబ్జా చేయడానికి అధికార యంత్రాంగాన్ని గట్టిగా వినియోంచుకొని వివాదాల్లోకి వెళ్ళారు. ఎన్నో ఏళ్ళుగా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని కుండలు, బొమ్మలు, సిమెంట్ సామగ్రి తయారు చేసుకొని జీవనం సాగిస్తున్న కుమ్మర్ల స్థలాన్ని ఆక్రమణలుగా చూపించారు. రాత్రికి రాత్రే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సహకారంతో స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకూ వెళ్ళడంతో బాలినేనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
అనేక వివాదాలు: తర్వాత కుమ్మర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్థుతానికి ఆ స్థలం నిరుపయోగంగా మారింది. జాతీయ రహదారి పక్కన కోట్ల విలువచేసే ఈ స్థలంలో బాలినేని బంధువులు హోటల్ నిర్మాణం చేపట్టే ప్రణాళికలో భాగంగానే ఆక్రమించే ప్రయత్నం చేశారనే ప్రచారం తీవ్రంగా సాగింది. ఇలాంటి వివాదాలు నియోజకవర్గంలో మరికొన్నిచోట్ల నెలకొన్నాయి. ఒంగోలులో ఓ బ్రాహ్మణ కుటుంబం స్థలం, సమతానగర్ ప్రాంతంలో ఎస్సీలకు చెందిన స్థలం ఆక్రమించుకోవడంలో బాలినేని అనుచరుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు ఒంగోలులో పలుచోట్ల ఇంటి స్థలాలు, పొలాలు కూడా దొంగపట్టాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించి సొంతం చేసుకున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అదే సమయంలో జిల్లా అధికారులు తనను పట్టించుకోవడం లేదంటూ సీఎంవో వరకూ వెళ్లారు బాలినేని. జరిగిన తతంగం అంతా సీఎంవోకు జిల్లా అధికారుల ద్వారా వెళ్లిన విషయం తెలుసుకునే బాలినేని అక్కడ దాకా వెళ్లారని ఆ తర్వాత నకిలీ స్టాంప్‌ల వ్యవహారంలో వేసిన సిట్ విచారణ ముందుకు సాగకుండా చేసుకోగలిగారని ప్రతిపక్షాలు విమర్శించాయి.
MLA Balineni Behaviour :ఈ వ్యవహారాలు ఇలా ఉంటే రాజకీయ గొడవల విషయంలో బాలినేని సిద్దహస్తుడని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇందుకు తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, అతని అనుచరగణాన్ని బాలినేని వాడతారనే ప్రచారం ఉంది. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నగరంలో ఓ పోలింగ్ బూత్ సమీపంలో తెలుగుదేశం పార్టీ వారిపై బాలినేని అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తెలుగుదేశం కార్యకర్తను ఓ ఫంక్షన్ హాలులోకి తీసుకెళ్ళీ మరీ చితకబాదారు. అయినా పోలీసులు వైఎస్సార్సీపీ వాళ్లమీద అంతంతమాత్రంగానే కేసులు పెట్టి వదిలేశారు. ఇటీవల సమతానగర్‌లో తెలుగుదేశం పార్టీ అభిమాని ప్రభావతి ఇంటివద్దకు ప్రచారానికి వెళ్లిన బాలినేని కోడలు కావ్య, ఆమె అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రచారంలో వాలంటీర్ ఎందుకు వచ్చారని ప్రశ్నించినందుకు ప్రభావతి కుటుంబ సభ్యులమీద దాడికి దిగారు. ఆమెకు మద్దతుగా వచ్చిన తెలుగుదేశం నాయకుల మీద దాడి చేసి రక్తం వచ్చేటట్లు కొట్టారు. తెలుగుదేశం నాయకులు ఎప్పీకి ఫిర్యాదు చేసి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. అక్కడ కూడా బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి అనుచరగణంతో వచ్చి ఎమర్జెన్సీ వార్డులోకి చొచ్కుకెళ్లి మరీ తెలుగుదేశం పార్టీ కారకర్తలమీద దాడికి దిగారు. ఆసుపత్రి లోపలికి వచ్చి దౌర్జన్యం చేయడంపై రోగులు, ఆసుపత్రి సిబ్బంది సైతం భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి లోపలికి ఇలా రావడం వల్ల రోగులు ఇబ్బందులకు గురవుతారనే ఇంగిత ఙ్ఞానం కూడా లేకుండా బాలినేని వ్యవహరించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ మాత్రం సహనం కూడా ప్రదర్శించలేకపోయారని రోగులు, వైద్య సిబ్బంది విమర్శించారు.