ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతల టీడీఆర్ బాండ్ల కుంభకోణం - వేల కోట్ల రూపాయలు స్వాహా - TDR Bonds Scam in AP - TDR BONDS SCAM IN AP

YSRCP Leaders TDR Bonds Scam in AP : టీడీఆర్‌ బాండ్ల పేరుతో పుర, నగరపాలక సంస్థలను వైఎస్సార్సీపీ నేతలు నంజుకు తిన్నారు. ఒక్క తిరుపతిలోనే టీడీఆర్‌ బాండ్ల పేరుతో వైఎస్సార్సీపీ నేతలకు దక్కిన కమీషన్లు రూ.500 కోట్లు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లలోనూ ఇలా కావాల్సినంత దోచుకున్నారు.

YSRCP Leaders TDR Bonds Scam in AP
YSRCP Leaders TDR Bonds Scam in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 9:30 AM IST

YSRCP Leaders TDR Bonds Scam in AP :టీడీఆర్‌ బాండ్ల పేరుతో పుర, నగరపాలక సంస్థలను వైఎస్సార్సీపీ నేతలు నంజుకు తిన్నారు. ఒక్క తిరుపతిలోనే టీడీఆర్‌ బాండ్ల పేరుతో వైఎస్సార్సీపీ నేతలకు దక్కిన కమీషన్లు రూ.500 కోట్లు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లలోనూ ఇలా కావాల్సినంత దోచుకున్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి భారీ కుంభకోణం వెలుగులోకి రాలేదన్న ఆరోపణలున్నాయి. దశాబ్దాల కిందట ఏర్పడిన పేదల కాలనీలకు, మురికివాడలకు, ఎప్పుడో వేసిన రహదారులకు, వివాదాస్పద స్థలాలకు, భూములకు పుర, నగరపాలక సంస్థల ద్వారా అడ్డగోలుగా బాండ్లు జారీ చేయించారు. తిరుపతిలోనే కాదు విశాఖపట్నం, కాకినాడ, తణుకు ఇలా అనేకచోట్ల వైఎస్సార్సీపీ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులు వారికి వంత పాడారు. రాష్ట్రంలో ఐదేళ్లలో జారీ చేసిన బాండ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తే అనేక బాగోతాలు, వైఎస్సార్సీపీ నేతలకు అంటకాగిన అధికారుల అడ్డగోలు వ్యవహారాలు వెలుగులోకి వస్తాయి.

టీడీఆర్‌ బాండ్లలో అక్రమాలు - నివేదిక వచ్చాక చర్యలు: మంత్రి నారాయణ - Minister Narayana on TDR Bonds

విశాఖ :టీడీఆర్‌ బాండ్ల అడ్డగోలు వ్యవహారాల్లో మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అడ్డాగా మారింది. వైఎస్సార్సీపీకు వీరవిధేయులైన కమిషనర్ల ద్వారా వైఎస్సార్సీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారు. సిరిపురం కూడలిలో జీవీఎంసీ కమిషనర్‌ బంగ్లా ఆనుకుని ఉన్న సీబీసీఎన్సీ స్థలాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ డెవలప్‌మెంట్‌కు తీసుకుని భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు.

ప్రాజెక్టుకు ముందున్న సీబీసీఎన్సీ స్థలంలో కొంత 17 ఏళ్ల తరువాత (2041లో) జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు నిర్మాణంలో పోతుందని ఆ స్థలానికి యుద్ధప్రాతిపదికన లెక్కలు వేసి రూ.63 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లను గత జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు జారీ చేశారు. అప్పటి పట్టణ ప్రణాళిక అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించారు. సీబీసీఎన్సీ స్థలం యాజమాన్య హక్కులపై హైకోర్టులో కేసులుండగానే అధికారులు మరీ బాండ్లు ఇచ్చారు.

విశాఖలోని బక్కన్నపాలెం సర్వేనంబరు 2లో పదేళ్ల కిందట జీవీఎంసీ అభివృద్ధి చేసిన రోడ్డులో రెండెకరాలు కోల్పోయినట్లు ఒకరికి రూ.120 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు ఇచ్చారు. అదే రోజున రాయలసీమకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు బాండ్లపై హక్కులు వారికి దఖలు పడేలా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అంతేకాక భూమి విలువ తక్కువ చూపించి టీడీఆర్‌ బాండ్లు ఇచ్చారని జీవీఎంసీకి మరోసారి దరఖాస్తు చేయడం, డోర్‌నంబరు మార్పించి అదనంగా మరో రూ.86 కోట్ల బాండ్లు నగరపాలక సంస్థ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. వైఎస్సార్సీపీ పెద్దల ఆదేశాలతో జీవీఎంసీ ప్రస్తుత కమిషనర్‌ సాయికాంత్‌వర్మ సహకరించారన్న ఆరోపణలున్నాయి.

దశాబ్దాలుగా నిరుపేదలు నివసిస్తున్న పెద్దజాలారిపేట, సీతమ్మధారలోని బిలాల్‌ కాలనీ భూమి, మరో మురికివాడపైనా టీడీఆర్‌ బాండ్ల కోసం వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించారు. దసపల్లా భూమిలో 40 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్నానని వైఎస్సార్సీపీ ముఖ్య నేత ఒకరు పరిహారంగా జీవీఎంసీ నుంచి రూ.120 కోట్ల విలువైన బాండ్లు తీసుకునేందుకు పావులు కదిపారు. ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

అరాచకాల్లో ఆరితేరిన తండ్రీ కొడుకులు - తిరుపతిలో అంతా ఆ నాయకుడి 'కరుణ'

తిరుపతి :ఐదేళ్లలో అత్యధికంగా టీడీఆర్‌ బాండ్లు జారీ చేసిన నగరపాలక సంస్థల్లో తిరుపతి ప్రథమ స్థానంలో నిలిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్‌ అభినయ్‌రెడ్డికి నగరపాలక అధికారులు దాసోహమయ్యారు. తిరుపతిలో రూ.4 వేల కోట్ల టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం జరిగినట్లు అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపించారు. మాస్టర్‌ప్లాన్‌ రహదారుల అభివృద్ధి పేరుతో వైఎస్సార్సీపీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం స్థలాలు కోల్పోయిన వారి పేరుతో బాండ్లు తీసుకుని కోట్లు కొల్లగొట్టారు.

18 మాస్టర్‌ప్లాన్‌ రహదారుల అభివృద్ధికి నగరపాలక వర్గం అనుమతి తీసుకుంది. రహదారుల నిర్మాణంతో స్థలాలు కోల్పోయినవారికి 340 వరకు టీడీఆర్‌ బాండ్లు నగరపాలక సంస్థ అధికారులతో జారీ చేయించారు. నివాస ప్రాంతాల్లో స్థలాలు కోల్పోయినా అవి కమర్షియల్‌ ప్రాంతాల్లో ఉన్నవిగా చూపించి బాండ్ల విలువ పెంచేశారు. వైఎస్సార్సీపీ నేతలకు సబ్‌రిజిస్ట్రార్లూ సహకరించారు. ఈ విధంగా నగరపాలక సంస్థ జారీ చేసిన రూ.వేయి కోట్ల విలువైన బాండ్ల విక్రయాల్లో కమీషన్ల కిందే వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి రూ.400-500 కోట్ల వరకు వెళ్లాయి. ఎంపిక చేసిన కొందరు ఏజెంట్ల ద్వారా బాండ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల బిల్డర్లకు విక్రయించారు.

కాకినాడ :వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సిఫార్సులపై నగరపాలక అధికారులు ఇష్టారాజ్యంగా టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారు. వైఎస్సార్సీపీకు విధేయుడైన ఒక అధికారిని కమిషనర్‌ సీట్లో ఎమ్మెల్యే కూర్చోబెట్టి కథ నడిపించారు. లేఅవుట్‌లోని ఓపెన్‌స్పేస్‌లో చేపట్టిన కన్వర్టబుల్‌ స్టేడియంపై ప్రైవేటు వ్యక్తులకు కాకినాడ నగరపాలక సంస్థ రూ.64.62 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు ఇవ్వడం ఒకెత్తయితే, కొద్ది రోజులకే మళ్లీ అదే స్థలాన్ని కమర్షియల్‌ ప్రాంతంలోనిదిగా చూపించి బాండ్ల విలువను రూ.129.25 కోట్లకు అధికారులు పెంచేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాసిన లేఖపై డోర్‌నంబరు 70-15-69లో రూ.18 వేలుగా ఉన్న చదరపు గజం విలువను సర్పవరం సబ్‌రిజిస్ట్రార్‌ అడ్డగోలుగా పెంచి సర్టిఫికేట్‌ ఇచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా :పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కారుమూరి నాగేశ్వరరావు సిఫార్సులపై పురపాలక అధికారులు అడ్డగోలుగా టీడీఆర్‌ బాండ్లు ఇచ్చారు. 2014-19 మధ్య ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో తణుకులో 4,600 చ.గజాలకు టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారు. 2019-24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 71,507 చ.గజాలకు అధికారులు బాండ్లు ఇచ్చారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

శ్రీలక్ష్మి పాత్రపైనా అనుమానం :ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పట్టించుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులపై టీడీఆర్‌ బాండ్లు జారీచేయాలని కమిషనర్లకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. శ్రీలక్ష్మి అండ చూసుకుని విశాఖలో ఐదేళ్లలో పని చేసిన నగరపాలక కమిషనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

తిరుపతిలో జరిగిన కుంభకోణంలోనూ వైఎస్సార్సీపీ నేతలు బాండ్లన్నీ అమ్ముకుని సొమ్ము చేసుకున్నాకే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు. తిరుపతిలో జారీ చేసిన టీడీఆర్‌ బాండ్లు చెల్లుబాటు కావని, కొత్తగా బాండ్లు ఇవ్వొద్దని కుంభకోణం బయటపడ్డాక నగరపాలక సంస్థను ఆదేశించి చేతులు దులిపేసుకున్నారు.

తిరుపతి టీడీఆర్ బాండ్లలో సగానికి పైగా అవినీతే - ఆ సొమ్మంతా కక్కిస్తాం: ఆనం

ABOUT THE AUTHOR

...view details