YSRCP Leaders Sand Mafia in Palnadu District :పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గానికి ఆయన స్థానికేతరుడు. కానీ ప్రజలు ఆదరించడంతో ముఖ్య ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అక్రమాల కొండగా రూపాంతరం చెంది జనానికి గుదిబండలా మారారు. ఇసుక, మట్టి, బినామీ లారీలు, కాంట్రాక్టులు, అటవీ భూముల ఆక్రమణ, బెదిరింపులు, దాడులు, వేధింపులు ఇలా చెప్పుకొంటూపోతే ఈయన లీలలు చాలానే ఉన్నాయి. పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కన్ను కృష్ణా నది ఇసుకపై పడింది. ఇసుక కాంట్రాక్టు సంస్థపై తన అనుచరులతో తిరుగుబాటు చేయించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తవ్వకాలను చేజిక్కించుకున్నారు. ప్రజాప్రతినిధి కుమారుడు, ఆయన మిత్రులు ఈ దందాను పర్యవేక్షించడానికి గుంటూరులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక రవాణాకు ఏకంగా నదిలోనే రోడ్డు వేయించారు. ఇందుకోసం కృష్ణా పక్కనే వేంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్రమైన కొండను తవ్వి రాళ్లు, మట్టిని తీసుకెళ్లారు.
నదీ ప్రవాహానికి అడ్డుకట్ట: ఇసుక తవ్వకాల పేరిట కృష్ణా నదీలో అడ్డకట్ట వేసి ప్రవాహ గతినే మార్చేశారు. వరదల సమయంలోనూ సొమ్ము చేసుకోవాలనే ఆలోచనత నదీ తీరంలో ఇసుక కొండలను సృష్టించారు. చింతపల్లి, కొత్తపల్లి, చామర్రు, కోనూరు, మల్లాది, దిడుగు, ముత్తాయపాలెం, అమరావతి, వైకుంఠపురం, ప్రకాశం బ్యారేజీకి దిగువనున్న గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు, అత్తలూరివారిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, బొమ్మువానిపాలెం, గాజుల్లంక, పెదలంక ఇసుక రీచ్‌లలో రాత్రిపగలు తవ్వకాలు కొనసాగించారు.
ఇసుక కాంట్రాక్టులతో వేల కోట్లు దోచుకున్న వైఎస్సార్సీపీ నేతలు : పట్టాభి
కేసులతో బెదిరింపులు : నదీ తీర గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగితే కేసుల పేరుతో బెదిరించారు. రోజూ వేయి లారీలకుపైగా ఇసుకను తరలించారు. పరిమితికి మించి నింపుతూ అదనంగా వసూలు చేశారు. ఒక్కో రీచ్ నుంచి ఇసుక తవ్వకాల ద్వారా రోజుకి 10 లక్షల మేర అక్రమాదాయం పొందారు. ఈ లెక్కన 10 రీచ్‌లకు కలిపి రోజుకి కోటి చొప్పున నెలకు 30 కోట్లు పొందారు. 16 నెలలపాటు నిరాటంకంగా ఇసుక తవ్వకాలు సాగించడం ద్వారా 480 కోట్లు అక్రమంగా ఆర్జించారు. అందులో వైకాపా పెద్దలకు 320 కోట్లు చెల్లించి ఆయన 160 కోట్లు పొందారనే చర్చ జోరుగా సాగుతోంది.
ట్రాన్స్‌పోర్టు సంస్థ ఏర్పాటు చేసి: ఇసుక రవాణాను సైతం ఈ ప్రజాప్రతినిధి పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. తన కుమారుడి మిత్రుడు, అతని బంధువు పేర్లతో ఒక ట్రాన్స్‌పోర్టు సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా నాడు-నేడు, జగనన్న కాలనీలకు ఉచిత ఇసుకను తరలించారు. లారీలకు సీరియల్ లేకుండా నేరుగా రీచ్‌లోకి వెళ్లి నింపుకొచ్చేవి. ఇందులో కొన్నింటిని లెక్కల్లో చూపకుండా సొమ్ము చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలోని సిమెంటు కంపెనీలు, గుత్తేదారులు, బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని ఇసుక తరలించేవారు. బినామీ ట్రాన్స్‌పోర్టు ద్వారా నెలకు 50 కోట్ల వరకు ఆర్జించారు. 16 నెలల్లో ఖర్చులు పోగా 40 కోట్లు వెనకేసుకున్నారు.
ఆయన దారిలోనే స్థానిక నేతలు: ప్రజాప్రతినిధి మేతను స్ఫూర్తిగా తీసుకున్న స్థానిక వైసీపీ నేతలు కూడా నదీ తీరంతోపాటు వాగులు, చెరువుల్లో మట్టి తవ్వి జేబులు నింపుకొన్నారు. ఆయన అనుచరుల్లో ఒకరు క్రోసూరు మండలంలో 50 ఎకరాల అటవీ భూములను చదును చేసి ఎకరా లక్ష చొప్పున అమ్ముకున్నారు. రేషన్‌బియ్యం దందా, మద్యం గొలుసు దుకాణాలను ఆయా మండలాల నేతలకు అప్పగించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో 250 ఎకరాలను సేకరించింది. ఇందులోనూ ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుని ఎకరం ధర 15 లక్షల నుంచి 20 లక్షలుగా పలుకుతున్న భూముల్ని ఎకరాకు 50 లక్షల నుంచి 55 లక్షల చొప్పున ప్రభుత్వానికి అంటగట్టారు.