YSRCP Leaders Join in TDP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని వలసల భయం వెంటాడుతోంది. ఇంతవరకు వైసీపీలో కొనసాగించిన వారందరూ ఒక్కొక్కరుగా టీడీపీ గూటికి చేరుతున్నారు. నిన్నా మెన్నటి వరకూ వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడగా, తాజాగా వైసీపీ నేతలకు కుడి భుజంగా ఉన్న నేతలు సైతం ఆ పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులకు సన్నితులుగా ఉన్న నేతలు పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తున్నారు.
వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల పర్వం :సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల పర్వం కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సొంత మండలం నల్లమాడులోని నల్ల సింగరాయపల్లిలో వందమంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీధర్‌రెడ్డి సొంత మండలంలో ఇంత మంది వైసీపీను వీడి టీడీపీలోకి చేరటం కలకలం రేపుతోంది.
వైసీపీని వీడిన 300 కుటుంబాలు :ఎన్నికల సమిస్తున్న తరుణంలో విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. జిల్లాలోని కొత్తపేటకు చెందిన ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వైసీపీ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు ఆధ్వర్యంలో 300 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరాయి. వీరందరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు విజయనగరం శాసనసభ, లోక్ సభ అభ్యర్థులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, కలిశెట్టి అప్పలనాయుడులు టీడీపీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీడీపీ నేతలు :శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కోనసాగుతున్నాయి. పోలాకి మండలం ఉరజాం యాట్ల, పసివలస గ్రామాల నుంచి 100 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.