YSRCP Leaders Irregularities :ఆ నేత భూముల మేతలో ఆరితేరారు. దేవుళ్లకే శఠగోపం పెట్టి మాన్యంను ఫలహారంగా లాగించేశారు. వెతికి మరీ వివాదాస్పద భూముల్ని గుర్తించి సొంతం చేసుకున్నారు. కబ్జాల్లో మునిగితేలారు. ఇలా ఒకటా రెండా గత ఎన్నికలకు ముందు ఖర్చుల కోసం భూములు ఆమ్ముకున్న ఆయన ఈ ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాలు కొల్లగొట్టారు. అసలే అధికార పార్టీ ప్రజాప్రతినిధి సోదరుడేమో రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలో ఉన్నారు. ఇక అడ్డు ఏముందన్నట్లుగా అక్రమాలతో పేట్రేగిపోయారు. అనతికాలంలోనే వందల కోట్లకు పడగలెత్తారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి. భూదందాలకు అసలు సిసలైన చిరునామాగా మారారు.
వివాదాస్పద భూములు గుర్తించేందుకు ప్రత్యేక బృందం :నియోజకవర్గం పరిధిలో వివాదాస్పద భూములు గుర్తించేందుకు అనుచరగణంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వివాదాల్ని పరిష్కరించే ముసుగులో ఇరుపక్షాలను పిలిపించి ఆ భూముల్ని అతి తక్కువ ధరకు దక్కించుకుంటారు. ఇరుపక్షాల్లో ఎవరైనా దానికి అంగీకరించకపోతే వివాదాన్ని మరింత జటిలం చేసి ముప్పుతిప్పలు పెడతారు. భూ ఆక్రమణలకు పాల్పడటం వివాదాస్పద భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటి రికార్డులు తారుమారు చేయటంలో ఆరితేరారు. రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకుని భూదందాలు నడిపిస్తున్నారు. తన అక్రమాలకు సహకరించని అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించేశారు. నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాల్లో కొన్నాళ్ల పాటు రెగ్యులర్ తహసీల్దార్‌లు లేకుండా ఉప తహసీల్దార్‌లను ఇన్‌ఛార్జీలుగా ముందు పెట్టి తాను అనుకున్న పనులన్నీ చేయించుకున్నారు. తొలుత భూ రికార్డులు తారుమారు చేయించి వేరే వ్యక్తుల పేరిట హక్కులు కల్పిస్తారు. ఆ తర్వాత ఆ భూములను తన పేరిట, కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తారు.
ఉప తహసీల్దార్‌ను అడ్డం పెట్టుకుని దోపిడీ :దత్తిరాజేరు, మెంటాడ మండలాల పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం భూ సేకరణ జరిగింది. అయితే అనధికారికంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతుల పేరిట ఎకరాకు రూ.3 లక్షల చొప్పున పరిహారం వచ్చేలా చేసి ఆ సొమ్మును మరో ప్రజాప్రతినిధితో కలిసి కాజేశారు. ఓ ఉప తహసీల్దార్‌ను అడ్డం పెట్టుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు. రెండేళ్ల పాటు ఈ మండలానికి తహసీల్దార్ లేకుండా ఉపతహసీల్దార్‌ను మాత్రమే అడ్డం పెట్టుకుని కావాల్సిన వ్యవహారాలు నడిపించారు.
ఈ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు బొండపల్లి మండలంలో పలు క్వారీలు ఉన్నాయి. రెండేళ్ల కిందట వాటి లీజు గడువు ముగిసింది. లీజు పునరుద్ధరణ కోసం చేసుకున్న దరఖాస్తుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారులను ఆ గ్రామాల్లోకి వెళ్లనివ్వలేదు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేలా చేసి మమ అనిపించారు. తిరిగి ఆ లీజు దక్కించుకున్నారు. గంట్యాడ మండలంలో ఈ ప్రజాప్రతినిధికి ఒక క్వారీ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారు. అయినా సరే అటు వైపు తొంగిచూసేందుకు ఏ అధికారీ సాహసించలేదు.
గజపతినగరంలోని తన భూముల్లో స్థిరాస్తి వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఏకంగా సుజల స్రవంతి కాలువ డిజైన్‌నే మార్పించేశారు. ఈ ప్రజాప్రతినిధి భూముల వద్దకు వచ్చేసరికి ఈ కాలువ అష్ట వంకర్లు తిరిగింది. గజపతినగరం మండలం లింగాలవలస, తుమ్మికాపల్లి, శ్రీరంగరాజపురం, గంట్యాడ మండలం మదుపాడ ప్రాంతాల్లో చంపావతి, గోస్తనీ నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపించి వాటిల్లో దోచుకున్నారు. ఇసుక, మట్టి తవ్వకాలు, అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు.