కొల్లేరులో వైసీపీ కల్లోలం - ఇష్టారాజ్యంగా అక్రమ చెరువుల తవ్వకాలు YSRCP Leaders Destroying Kolleru Lake: వైసీపీ హయాంలో కొల్లేరు విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. కొల్లేరు తవ్వకాలకు పై స్థాయి అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నాం, మా నాయకుడి ద్వారా అధికారులను అన్ని విధాలా సంతృప్తి పరిచాం, మేం కొల్లేరులో తవ్వకాలు చేసినా అడిగేవారు, ఆపేవారు లేరు అంటూ స్థానిక వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొల్లేరులో భారీ యంత్రాలతో విధ్వంసం సృష్టిస్తున్నారు.
అభయారణ్యంలోని 5వ కాంటూరులో వందల ఎకరాల్లో అక్రమంగా, అడ్డగోలుగా చెరువులు తవ్వేస్తున్నారు. వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. కొల్లేరులో సాగు చేసిన రొయ్యలు, చేపలను బహిరంగంగా రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
అధికారం అండతో కొల్లేరును గుల్ల చేస్తున్న అక్రమార్కులు - జగన్ హామీ డొల్ల
పైడిచింతపాడు, ప్రత్తికోళ్లలంక, కోమటిలంక, పెదయాగనమిల్లి, మాధవాపురం, గడివాకలంక, పందిరిపల్లెగూడెం, కొవ్వాడలంక, నత్తగుల్లపాడు, వడ్లకూటితిప్ప, చెట్టున్నపాడు, ఆగడాలలంక గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తున్నారు. ఏలూరు, భీమడోలు, నిడమర్రు, దెందులూరు మండలాల్లో వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. ఈ చెరువుల్లో బాహాటంగానే సాగు పనులు చేస్తున్నారు. వాహనాలనూ చెరువుల వద్దకు రప్పించి పట్టపగలే సరకు రవాణా చేస్తున్నారు. చెరువుల్లో చేపలకు, రొయ్యలకు మేత తీసుకువెళ్లేందుకు సరకు రవాణా చేసేందుకు విశాలమైన రహదారులను ఏర్పాటు చేసుకున్నారు.
కైకలూరు మండలం ఆటపాక పక్షల కేంద్రానికి కూతవేటు దూరంలోని కోమటిలంకలోనూ విచ్చలవిడిగా తవ్వకాలు సాగుతున్నాయి. పాత చెరువుల మరమ్మతుల పేరుతో ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు. ఏలూరు గ్రామీణ మండలం గుడివాకలంకలో ప్రధాన రహదారిని అనుకునే దాదాపు 50 ఎకరాల్లో ఇలా యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. రహదారి పక్కనే భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నా సమీపంలో అటవీ చెక్‌పోస్టులు ఉన్నా ఆ వైపు అధికారులు మాత్రం కనెత్తి చూడటం లేదు. అక్కడికి ఎవరు వచ్చినా తెలిసేలా సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు నియోజకవర్గ స్థాయి నాయకుడి ఆశీస్సులతో కథ నడిపిస్తున్నారు.
Kolleru Lake: కొల్లేరు గల్లంతవుతోంది.. చేపల చెరువుల అక్రమ సామ్రాజ్యం!
కొల్లేరులో అక్రమ తవ్వకాలకు ఏలూరు జిల్లాలోని నలుగురు వైసీపీ నేతలే సూత్రధారులు. చెరువులు తవ్వుకోవాలనుకున్నవారు వారికి భారీ ముడుపులిచ్చి తమ పరిధిలోని నేతను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆయా ప్రాంతాల్లో సదుపాయాలను బట్టి ఆ నాయకులు ఎకరానికి 50 వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తున్నారు. వారే అధికారులతో మాట్లాడి ఒప్పిస్తారు. దీంతో తవ్వకాలను అడ్డుకోవద్దని స్థానిక అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు వస్తాయి.
అంతే ఎవరూ ఆ వైపు కన్నెత్తి చూడరు. వీరిలో ఇద్దరు నేతలైతే కొల్లేరులో 3వేల ఎకరాల్లో సొంతంగా చెరువులు తవ్వుకుని సాగు చేస్తున్నారు. ఈ అంశమై వన్యప్రాణి సంరక్షణ శాఖ ఏలూరు రేంజి అధికారి శ్రీసాయి మాత్రం ‘తవ్వకాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, కాంటూరు పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
కొల్లేరులో అక్రమ చెరువుతవ్వకాలు.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.. అడ్డుకున్న అటవి,రెవెన్యూ సిబ్బంది