YSRCP Leaders Attacked On Police In Palnadu : పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఎస్సై చెన్నకేశవులుపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న పోలింగ్ రోజున రాత్రి సమయంలో బొల్లాపల్లిలో మూగ చింతలపాలెం గ్రామానికి తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై చెన్నకేశవులు వైఎస్సార్సపీ దాడిని అడ్డుకుని టీడీపీ నేతల కారుని తప్పించారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తెలుగుయువత నేతలు మాత్రం అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారు వెళ్లిపోయిన తర్వాత ఎస్సై చెన్నకేశవులుపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
టీడీపీ వారికి రక్షణ కల్పిస్తావా అంటూ పిడిగుద్దులు గుద్దారు. కర్రలతో దాడి చేశారు. అడ్డుకున్న కానిస్టేబుల్ నాగేంద్రని కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొట్టారు. ఈ దాడిలో ఎస్సై చెన్నకేశవులు తలకు గాయమైంది. కానీ అధికార పార్టీ నేతలు కావటంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిని తెలుగు యువత నాయకులు తమ సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావటంతో ఎస్సై(SI) పైనా దాడి జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈవిషయంపై ఎస్సై చెన్నకేశవులుని అడగ్గా దాడి జరిగింది నిజమేనన్నారు. అయితే ఆ ఘటనను వదిలేసినట్లు చెప్పారు.