YSRCP Leaders as APMDC Employees: సిద్ధం పోస్టర్‌లో కనిపిస్తోన్న ఇతని పేరు యారా సాయిప్రశాంత్. ఇతను వైసీపీ నేత కాదు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ - ఏపీఎండీసీలో (Andhra Pradesh Mineral Development Corporation) అసిస్టెంట్ మేనేజర్. జీతం 30 వేలు, అదనపు భత్యం 30 వేలు, హెచ్‌ఆర్‌ఏతో కలిపి ప్రతినెలా 70 వేలు తీసుకుంటున్నారు. ఇంత జీతమిచ్చి, అసిస్టెంట్ మేనేజర్‌గా తీసుకున్నారంటే ఆయన ఏంబీయేనో, పీజీనో చేసుంటానుకుంటే పొరపాటే. పాయిప్రశాంత్ చదివింది ఇంటరే. పోనీ నిత్యం విధులకైనా హాజరవుతాడా అంటే సంస్థ ప్రధాన కార్యాలయంలో అతన్ని చూసిన వారే లేరు. ఎప్పుడూ సీఎంవోలోనో, వైసీపీ రాష్ట్ర కార్యాలయంలోనో ఉంటూ పార్టీ ప్రచారానికి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంటాడు. అయినా సరే ఏపీఎండీసీ 2020 మే నెల నుంచి అతన్ని పొరుగు సేవల ఉద్యోగిగా చూపుతూ జీతం ఇస్తోంది.
ఈ ఫొటోలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డితో పాటు ఉన్న వ్యక్తి పేరు పి.హేమంత్‌కుమార్‌రెడ్డి. చిత్తూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు. కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి పార్టీ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాడు. ఇతనూ ఏపీఎండీసీలో కాంట్రాక్టు విధానంలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. ఏ రోజూ ఏపీఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరైన దాఖలాల్లేవు. కానీ నాలుగైదు సంవత్సరాలుగా నెలకు 70 వేల జీతం పొందుతున్నాడు.
APMDC: జోరుగా ముగ్గురాయి అక్రమ రవాణా.. సిబ్బంది మధ్య విభేదాలతో వెలుగులోకి
మంత్రి, ఎంపీ సిఫార్సుతో 400 మందికి ఉద్యోగాలు: సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డిలకు చెందిన తిరుపతి ఆఫీసులో బీఆర్ తేజేష్‌రెడ్డి పనిచేస్తున్నాడు. అతను ఏపీఎండీసీలో కాంట్రాక్టు విధానంలో నాలుగైదు సంవత్సరాల కిందట మేనేజర్‌గా నియమితుడయ్యాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తిరుపతిలో మంత్రి, ఎంపీలకు సంబంధించి వ్యవహారాలను చూడటమే ఆయన విధి. ఏపీఎండీసీకి పనిచేసిన దాఖలాల్లేవు. అయినా సరే ఏపీఎండీసీ నుంచి ప్రతినెలా 70 వేల వరకు జీతం తేజేష్‌రెడ్డికి అందుతోంది.
వీళ్లే కాదు ఏపీఎండీసీలోకి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల సిఫార్సుతో 400 మంది కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులుగా అడుగుపెట్టారు! వీరిలో 200 మంది విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నారు. చాలామందికి ఎలాంటి పనీ ఉండదు. దాంతో ఒకరు చేయాల్సిన పనిని ముగ్గురు, నలుగురు పంచుకొని ఏదో చేస్తున్నట్లు చూపేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు అసలు కార్యాలయానికే రారు. మంత్రి, ఎంపీల సిఫార్సుతో చేరిన ఉద్యోగుల్లో 80 శాతం ఉమ్మడి చిత్తూరు జిల్లా వారే. కడప ఎంపీ సిఫార్సుతో మరో 10 శాతం మంది వైఎస్సార్ జిల్లా వారు వచ్చారు. మిగిలిన 10 శాతమే ఇతర జిల్లాలకు చెందిన వారు.