SUDARSHAN REDDY ILLEGAL ACTIVITIES: అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్‌బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2023లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టు దక్కించుకున్న ఆయన, వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ సుదర్శన్‌రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం అప్పట్లో చర్చనీయాంశమైంది.
చంద్రబాబు అరెస్టు సమయంలోనూ హడావుడి: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన జల్లా సుదర్శన్ రెడ్డి వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడు. ఆయన అండతోనే గాలివీడు ఎంపీపీ పదవికి రాజీనామా చేసి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టు దక్కించుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా 2023 మే లో ప్రభుత్వం జీవో జారీ చేసి సుదర్శన్ రెడ్డిని డీఓపీగా నియమించింది అప్పటి ప్రభుత్వం.
చంద్రబాబు అరెస్టు సమయంలోనూ సుదర్శన్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి, మీడియా ముందు హడావుడి చేశాడు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడ్డాక సీఐడీ ప్రత్యేక పీపీతో కలిసి మీడియా ముందుకు వచ్చిన సంఘటన న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాంటి రాష్ట్ర స్థాయి హోదాలో పని చేసిన వ్యక్తి మండలస్థాయి అధికారులపై చేయి చేసుకోవడం సిగ్గు చేటని న్యాయవాదులు విమర్శిస్తున్నారు. డీఓపీగా సుదర్శన్‌రెడ్డి నియామకాన్ని కొట్టేస్తూ 2024 ఫిబ్రవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది.