YSRCP Leader Land Encroachment in YSR District :పార్టీ అధినేతను ఆదర్శంగా తీసుకున్నారో లేక వైఎస్సార్సీపీలో మిగతా నేతలకంటే తనేం తక్కువా అని అనుకున్నారో కానీ అక్రమాలే ఆశ, శ్వాసగా అధికారం చేపట్టిన నాటి నుంచి కడప జిల్లాలో పెద్ద వయస్సున్న ఆ ప్రజాప్రతినిధి పెద్దఎత్తున ఆక్రమణలకు తెగబడ్డారు. అయిదేళ్ల పదవీకాలంలో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూములను కబ్జా చేసిన ఈ పెద్దమనిషి గుత్తేదారుల నుంచి వాటాలు, ఇసుక, మట్టి అమ్మకాల ద్వారా వందల కోట్ల రూపాయలు ఆర్జించారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా 10 శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే. కబ్జాలకు తోడు ఇసుక, మట్టి తరలింపులో కమీషన్ల ద్వారా 200 కోట్ల రూపాయలకుపైగా వెనకేసుకున్నారు.
Corruption Irregularities of YSRCP :మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామంలోని సర్వే నంబరు 507లో ఉన్న భూముల్ని బినామీల పేరిట ఈ ప్రజాప్రతినిధి ఆక్రమించారు. ఈ సర్వే నంబరులో మొత్తం 267.56 ఎకరాలు రిజర్వ్ ఫారెస్టుగా రికార్డుల్లో ఉంది. సర్వే నంబరు 506/బిలో 38.94 ఎకరాలూ అటవీ భూమిగానే చూపిస్తోంది. ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలో 306.5 ఎకరాల అటవీ భూమి ఉంటే ఇందులో సగభాగంలో ఇప్పటికే మామిడి తోట సాగు చేస్తున్నారు. మిగతా సగం ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్రమిత అటవీ భూమిలోని మామిడి తోటకు అధికారులు సూక్ష్మ సేద్య పరికరాలు ఇచ్చేశారు. అదంతా అటవీ భూమి తమకేం సంబంధం లేదంటూ రెవెన్యూ అధికారులు తప్పించుకున్నారు.
నిత్య'కళ్యాణం' పచ్చతోరణంలా 'దుర్గం' నేత అవినీతి - ఆమె పేరు చెబితేనే వణుకుతున్న ప్రజలు
అటవీ భూముల ఆక్రమణపై మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎన్జీటీ ఆదేశాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటాయి. కానీ మైదుకూరు అటవీ భూమి ఆక్రమణ విషయంలోనూ ఎన్జీటీ ఆదేశాలు అమలు కాలేదు.
YSRCP Leader Irregularities : చాపాడు మండలం వెదురూరు వద్ద పెన్నానదిలో ఒక మండలస్థాయి ప్రజాప్రతినిధిని ముందుంచి ఈ ముఖ్యనేత తవ్వకాలు చేయిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ నేత ఒకరు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా ఇప్పుడా వివాదం కోర్టులో ఉంది. మరో మండలస్థాయి ప్రజాప్రతినిధి కుందూ నది నుంచి అక్రమ ఇసుక రవాణా ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టి ముఖ్యనేతకు వాటాలు ఇస్తున్నారు. దువ్వూరు గుట్ట నుంచి ఎర్రమట్టి అక్రమ తరలింపు ద్వారా భారీ ఎత్తున ఆర్జించారు. ఖాజీపేట మండలం మునిపాక సమీపం నుంచి ఇసుకను భారీగా తరలించారు. అదే మండలం అప్పనపల్లె వద్ద తన అనుచరుల పేరుతో గుట్ట నుంచి మట్టి తవ్వకాలకు అనుమతి పొంది వైయస్‌ఆర్, నంద్యాల జిల్లాల్లో అమ్మి కోట్లు రూపాయలు సంపాదించారు.