YSRCP Leader Irregularities in West Godavari: పశ్చిమ గోదావరి చివర్లో ఉన్న ఈ నియోజకవర్గ కేంద్రానికి బ్రిటిష్ హయాంలోనే ఎంతో పేరు ఉంది. అలాంటి చోట ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆయన, ఉభయగోదావరి జిల్లాల ఇసుక ర్యాంపులన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. చేసే అక్రమాలన్నీ అధికారికంగానే కనిపించినా ఆయనకు లబ్ధి పరోక్షంగా దక్కుతుంది. ప్రతి నిర్ణయంలోనూ సొంత సామాజికవర్గ ప్రయోజనాలు ఉండేలా చూడడంలో ఈయన దిట్ట.
లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలించి: వైసీపీ సర్కారు ఏర్పడిన కొత్తలోనే ఈ ఎమ్మెల్యే ఇసుకాసురుడి అవతారం ఎత్తారు. పార్టీలోని ఒక కీలక నాయకుడి అండదండలు పుష్కలంగా ఉండటంతో రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో సొంత మనుషులను పెట్టుకుని రెండేళ్ల పాటు దందా కొనసాగించారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, ఈయన మాత్రం నిత్యం వేలాది ట్రాక్టర్లు, లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలించి దండిగా డబ్బులు వెనకేసుకున్నారు. వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ అంటే పెద్దల వాటా ఉండనే ఉంటుంది. అది పోనూ మిగతా మొత్తంతో కోట్లకు పడగలెత్తారు.
మట్టి తోలకం పేరుతో మరో దందా: జగనన్న లేఅవుట్‌లకు ఎంజీపాలెం వద్ద స్థలాల సేకరణ విషయం ముందే తెలుసుకొని, ఆ భూముల యజమానులతో అనధికారంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద ధరకు మించి ఎకరానికి 10 లక్షలకు పైగా ఎక్కువ ధరకు ప్రభుత్వం కొనేలా వ్యవహారం నడిపారు. ఆ అదనపు సొమ్మంతా వెనకేసుకున్నారు. లేఅవుట్ చదును చేసేందుకు మట్టి తోలకం పేరుతో మరో దందా నడిపారు. తవ్విన మట్టిని ఇతరులకు పెద్ద మొత్తానికి అమ్మారు. లేఅవుట్లకు తక్కువ సరఫరా చేసి, ఎక్కువ లారీలు నమోదు చేశారు. అలా బిల్లులనూ స్వాహా చేసిన ఘనుడు.
150 ఎకరాలకు పైగా: రెండు జిల్లాలను కలిపే గోదావరిపై ఒక కీలక వంతెన, రహదారి విషయంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మార్గాన్ని అసైన్డు, డీ పట్టా, జిరాయితీ భూముల మీదుగా మళ్లించారు. ముందే తక్కువ మొత్తానికి ఆ భూములను తన బినామీల పేరిట సొంతం చేయించుకున్నారు. అధికారులపై ఒత్తిడి చేసి భూములను రెగ్యులర్ చేయించుకున్నారు. కొన్ని ప్రైవేటు భూములనూ అనుచరుల సాయంతో కొనుగోలు చేయించారు. మొత్తంగా దాదాపు 150 ఎకరాలకు పైగా దక్కించుకున్నారు. వంతెన రాకతో ఆ భూముల ధరలు పెరిగి భారీగా లబ్ధి పొందారు.