YSRCP Leader Irregularities :కాకినాడ జిల్లాలో ఆయనో ప్రజాప్రతినిధి! వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కొంతకాలం కీలక పదవిలో ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న నాయకుల్లో ఆయనా ఒకరు! భూదందాలు, ఇళ్ల పట్టాల లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లు ఇలా ప్రతీ పనిలో చేతివాటమే. ప్రజాప్రతినిధి అక్రమాలన్నీ ఆయన తండ్రి, సోదరుడు, ముఖ్య అనుచరుడు చక్కబెడుతుంటారు. నియోజకవర్గంలో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు సహా ఎలాంటి అభివృద్ధి పనుల కాంట్రాక్టులైనా వాళ్లు చెప్పిన వారికే ఇవ్వాలి. చివరికు ప్రైవేటు పరిశ్రమల్లోని కాంట్రాక్టులపైనా వారే పెత్తనం చెలాయిస్తుంటారు. లేదంటే అధికార బలాన్ని ప్రయోగిస్తారు. ఇబ్బందులు సృష్టిస్తారు. ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల్ని దర్శనం చేసుకుని, అడిగినంత సమర్పించుకున్నాకే ఎవరికైనా రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు. పోలీస్, రెవెన్యూ తదితర కీలక శాఖల అధికారులనూ గుప్పెట్లో పెట్టుకుని దందాలకు తెగబడుతున్నారు.
ఈ నాయకుడి నియోజకవర్గం పరిధిలో కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ సంస్థకు చెందిన సూపర్ మార్కెట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని పగబట్టారు. రోజూ ఆ సూపర్ మార్కెట్ ముందు చెత్త పోయించారు. కొన్నిరోజులకు సూపర్‌మార్కెట్ ప్రాంగణం ఉన్న భవన యజమానులకు విషయం అర్థమైంది. ఆ నాయకుడి తండ్రిని కలిస్తే దుర్భాషలాడి పంపారు. పక్క నియోజకవర్గంలో సూపర్‌మార్కెట్ ప్రారంభించినప్పుడేమో అక్కడి ప్రజాప్రతినిధిని ఆహ్వానించి, మా నియోజకవర్గంలో ప్రారంభానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదంటూ తాడెత్తున లేచారు.
ఇటీవల ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికీ సదరు నాయడుకి సోదరుడే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వివాదంలో ఉన్న ఓ భూమిని ఆ నాయకుడి సోదరుడు తక్కువ ధరకు కొన్నారు. ఐతే ఒప్పందం మేరకు తమకు చెల్లించాల్సిన డబ్బును పూర్తిగా ఇవ్వకుండా బెదిరించారని విక్రయదారు తల్లి తొలుత ఆరోపించారు. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ ఆమె మాట మార్చేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ అధికారులు గొడవను సెటిల్మెంట్ చేసేశారు. ఇక నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో 20 ఏళ్ల క్రితం వేసిన ఐదెకరాల లేఅవుట్‌ను కొందరు కడప వ్యక్తులు కబ్జా చేసి, చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ దందాలో నియోజకవర్గ నాయకుడికి భారీగానే లెక్క ముట్టింది.
జగనన్న కాలనీల లేఅవుట్ల చదును పనుల్లో ఈ నాయకుడు భారీ మొత్తంలో వెనకేసుకున్నారు. కరప, కాకినాడ గ్రామీణ మండలాల్లో 400 ఎకరాల్లో జగనన్న లేఅవుట్లు ఏర్పాటు చేయగా వాటిల్లో 200 ఎకరాల్లో ఫిల్లింగ్‌కు తన బినామీలైన బంధువుల పేరిట కాంట్రాక్టు తీసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అక్కడ గ్రావెల్‌తో ఫిల్లింగ్ చేయకుండానే బిల్లులు పెట్టారు! వీటి మంజూరుకు నిరాకరించిన ఉపాధి హామీ ఏపీవోను అక్కడి నుంచి బదిలీ చేయించి, మరొకరిని నియమించుకుని బిల్లులు మంజూరు చేయించుకున్నారు. మరోవైపు జగనన్న లేఅవుట్లను చదును చేయడానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం అందించిన గ్రావెల్‌ను ప్రైవేటు లేఅవుట్లకు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఇలా రెండు రకాలుగా నూ అనుచిత లబ్ధి పొందారు.