ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇసుక టెండర్లలో గోల్​మాల్ - జగన్‌ మార్క్‌ అడ్డాగా దోపిడీ - YSRCP Irregularities Sand Tenders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 7:09 AM IST

YSRCP Leaders Illegal Sand Mining : ఏపీలో ఇసుక టెండర్ల విషయంలో గత జగన్ ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడలను అమలు చేసింది. టెండర్లలో ఎవరూ పోటీకి రాకుండా ముందే వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా ధరావతు, పెర్ఫార్మెన్స్‌ గ్యారంటీ 1 శాతం నుంచి 8 శాతానికి పెంచింది. దీంతో సంస్థలు రూ.120 కోట్లు చెల్లించేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు ఇదే తరుణమని భావించి ప్రణాళిక ప్రకారం జేపీ సంస్థకు కట్టబెట్టింది. దానిపేరిట వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు దోపిడీకి పాల్పడ్డారు.

YSRCP Irregularities in Sand Tenders
YSRCP Irregularities in Sand Tenders (ETV Bharat)

YSRCP Irregularities in Sand Tenders : రాష్ట్రంలో జగన్ సర్కార్ ఇసుక దందా పేరిట రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది. కేవలం తాము అనుకున్న బినామీ కంపెనీలు మాత్రమే బిడ్లలో పాల్గొనేలా చేసి, అందులో ఒకటి టెండరు దక్కించుకున్నట్లు చూపించి దానిపేరిట ఈ దందాను చేశారు. ఇందుకు టెండరు నిబంధనల రూపకల్పన సమయంలోనే బీజం పడింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు చెప్పినట్లుగానే అప్పటి గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి ఇసుక టెండర్లలో పలు షరతులు విధించి ఇతరులెవరూ పోటీకి రాకుండా చేశారు.

అత్యధికంగా 8 శాతం ధరావతు : టెండరు పిలిచినప్పుడు ఏ ప్రభుత్వశాఖ అయినా దాని అంచనా విలువలో ఒక శాతం ధరావతుగా చెల్లించాలని నిబంధన పెడుతుంది. బిడ్‌ దక్కించుకున్న వాళ్లు పెర్ఫార్మెన్స్‌ గ్యారంటీ కింద కూడా ఒక శాతం బ్యాంక్‌ హామీని ఇవ్వాల్సి ఉంటుందనే షరతు విధిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ సర్కార్​లో ముఖ్యమంత్రి జగన్‌ ఇసుక సొమ్మును అడ్డగోలుగా దోచుకునేందుకు టెండరు నిబంధనలు తమకు అనుకూలంగా మార్చారు.

ఇందులో భాగంగా 2021 ఆరంభంలో ఇసుక టెండర్లు పిలిచారు. ధరావతుగా 8 శాతం చెల్లించాలని, బిడ్‌ దక్కితే పెర్ఫార్మెన్స్‌ హామీగా కూడా 8 శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలని షరతులు పెట్టారు. ఏపీ వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో కలిపి రెండు సంవత్సరాల్లో ఇసుక విక్రయాల ద్వారా రూ.1,500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. ఇందులో 8 శాతం అంటే రూ.120 కోట్లు ధరావతుగా చెల్లించాలని నిబంధన విధించారు. అదేవిధంగా బిడ్‌ దక్కించుకున్న గుత్తేదారుకి చెందిన ధరావతుని పెర్ఫార్మెన్స్‌ గ్యారంటీగా పరిగణనలోకి తీసుకుంటామని అందులో తెలిపారు.

కానీ ఇంత భారీ మొత్తం ధరావతుగా, ఫెర్ఫార్మెన్స్‌ గ్యారంటీగా చెల్లించేందుకు ఏ ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు ఆసక్తి చూపలేదు. కేవలం ఉత్తరాదికి చెందిన నాలుగు సంస్థలతోనే బిడ్లు వేయించారు. ఇందులో జయ్‌ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(జేపీ) రూ.1,528 కోట్లు చెల్లిస్తానని కోట్‌చేయగా, ఆ సంస్థకే బిడ్లు కట్టబెట్టారు. తర్వాత టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ను ఉప గుత్తేదారుగా రంగంలోకి దించి, ఇసుక సొమ్మంతా వైఎస్సార్సీపీ ముఖ్య నాయుకులు దోచుకున్నారు.

జీసీకేసీ, ప్రతిమా కూడా ఇంతే : జేపీ సంస్థతో 2023 మేతో ఇసుక ఒప్పంద గడువు ముగిసినా నవంబర్ వరకు దాన్నే కొనసాగించారు. మళ్లీ గుత్తేదారుల ఎంపికకు టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా 8 శాతం ధరావతు, పెర్ఫార్మెన్స్‌ గ్యారంటీ షరతు పెట్టారు. ఇందులో భాగంగా ఇతరులను రానివ్వకుండా చేసి రాజస్థాన్‌కు చెందిన జీసీకేసీకి ఒక ప్యాకేజీ, తెలంగాణకు చెందిన ప్రతిమా ఇన్‌ఫ్రా సంస్థకు రెండు ప్యాకేజీలు కట్టబెట్టారు. ఈ రెండు సంస్థలను ముఖ్య నాయకుడి సోదరుడే తీసుకొచ్చి టెండర్లు ఇప్పించారు. ఇప్పటివరకు తెరవెనకు ఆయనే ఉండి ఈ ఇసుక దందాను సాగించారు.

ఐదు నిమిషాల్లో వెళ్లిపో :మొదట జేపీ సంస్థ 2021 మేలో ఇసుక టెండరు పొందగానే, చెన్నైకు చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ ఉప గుత్తేదారుగా వ్యవహరించి ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టింది. ఈ సంస్థ సర్కార్​కి తప్పుడు లెక్కలు చూపించి, ప్రతినెలా ముఖ్య నాయకులకు దోచిపెట్టింది. అయితే ఇంకా ఎక్కువ వాటా ఇవ్వాలంటూ 2022 సెప్టెంబర్​లో వారు ఒత్తిళ్లు చేశారు. వారిలో అప్పట్లో తండ్రి అండతో మైనింగ్‌శాఖను శాసించిన ఓ ఎంపీ, గతంలో ఉత్తరాంధ్రలో పెత్తనం చేసి ఇటీవల ఓ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పార్లమెంట్ స్థానం నుంచి ఇటీవల పరాజయం పాలైన విద్యుత్‌ సంస్థల అధినేత, ఓ ప్రభుత్వ సలహాదారు కలిసి టర్న్‌కీపై ఒత్తిడి తెచ్చారు. వాళ్లు నిర్దేశించిన మొత్తం చెల్లించలేమని టర్న్‌కీ తేల్చిచెప్పింది.

Illegal Sand Mining in Andhra Pradesh :దీంతో ఆ నలుగురు నాయకులు టర్న్‌కీ ఎండీని పిలిపించారు. ఉప గుత్తేదారుగా వైదొలుగుతున్నట్లు సంతకం చేసి ఇవ్వాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. జిల్లాల వారీగా కార్యాలయాలు, సిబ్బంది, పరికరాలు ఉన్నాయని, ఒక్క నెలలో లావాదేవీలు చూసుకొని వైదొలుగుతామని టర్న్‌కీ ఎండీ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ కుదరదని, సంతకం చేసి ఐదు నిమిషాల్లో వైదొలగాల్సిందేనని హెచ్చరించారని తెలిసింది. ఈ మేరకు సంతకాలు చేయించుకొని టర్న్‌కీని వెళ్లగొట్టారు.

మళ్లీ టర్న్‌కీ బిల్లులే వినియోగం : ఉప గుత్తేదారుగా టర్న్‌కీని 2022 సెప్టెంబర్​లో తరిమేశాక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాము మరో ఉప గుత్తేదారును నియమించే వరకు ఇసుక తవ్వకాలు, విక్రయాలు నిలిపి వేయాలని ప్రధాన గుత్తేదారైన జేపీ సంస్థ గోపాలకృష్ణ ద్వివేదికి, వెంకటరెడ్డికి లేఖలు రాసింది. అయినా సరే ఎక్కడా ఇసుక వ్యాపారం ఆగలేదు. ఈ క్రమంలోనే టర్న్‌కీ స్థానంలో ఓ విద్యుత్‌ సంస్థల అధినేతకు చెందిన బ్రాక్‌స్టోన్‌ అనే కంపెనీని ఉప గుత్తేదారుగా చూపించి వేబిల్లులు ఇచ్చారు.

దానిపేరిట జీఎస్టీ చెల్లింపు విషయంలో చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో హైదరాబాద్‌కు చెందిన కేకేఆర్‌ ఇన్‌ఫ్రా అనే మరో సంస్థను ఉప గుత్తేదారుగా తీసుకొచ్చారు. అయితే నెలరోజులు ఇసుక వ్యాపారం చేశాక జీఎస్టీ విషయంలో సమస్యలు వచ్చాయి. చివరికి మళ్లీ టర్న్‌కీ పేరిట ఇసుక వ్యాపారమంతా ముఖ్య నాయుకులే నిర్వహించారు.

మూడేళ్లలో 3 వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ - వైఎస్సార్సీపీ ముఠా మాస్టర్ ప్లాన్ - Sand Mining in Andhra Pradesh

నదులపై వైఎస్సార్సీపీ ఇసుక తోడేళ్లు - అభివృద్ధి పనులకు కొరత - YSRCP Leaders Illegal Sand Mining

ABOUT THE AUTHOR

...view details