Adani Bribe to YS Jagan :సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - సెకి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నాటి వైఎస్సార్సీపీ పెద్దలిచ్చిన ఆదేశాల ప్రకారం ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ-(ఏపీపీసీసీ) అడ్డగోలు లెక్కలు తయారు చేసింది. అసలు సెకి నుంచి వచ్చే కరెంట్ రాష్ట్రానికి అవసరమా? లేదా? అనే విషయాన్ని పక్కనపెట్టి, సెకి విద్యుత్‌ను ఎట్టిపరిస్థితుల్లో కొనాలనే లక్ష్యానికి వీలుగా డిమాండ్, సప్లై నివేదిక రూపొందించింది.
ఒప్పందం కోసమే విద్యుత్ డిమాండ్ లెక్కలు : 2024-25 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌ను 82,253 మిలియన్ యూనిట్లుగా ఏపీపీసీసీ అంచనా వేసింది. వివిధ విద్యుత్ ఒప్పందాల ద్వారా 56,315 మిలియన్ యూనిట్లు, మరో 15,942 మిలియన్ యూనిట్ల పునరుత్పాదక కరెంట్ అందుతుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచి సెకి ద్వారా 7286 మిలియన్ యూనిట్లు వచ్చినా ఇంకా 2710 మిలియన్ యూనిట్ల లోటు ఉంటుందని లెక్కగట్టింది.
అదే 2025-26లో సెకి నుంచి 14,572 మిలియన్ యూనిట్లు తీసుకున్నా ఇంకా 1246 మిలియన్ యూనిట్ల లోటు ఉంటుందని ఏపీపీసీసీ తెలిపింది. 2026-27లో ఒకవేళ సెకి నుంచి 17,000ల మిలియన్ యూనిట్లు తీసుకున్నా 5047 మిలియన్ యూనిట్ల లోటు ఉంటుందంటూ కమిటీ లెక్కలు కట్టింది. ఇది ఏపీఈఆర్సీ నివేదికకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా 6 నుంచి 7 శాతానికే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పరిమితం అవుతుంటే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ 8 శాతంగా పరిగణనలోకి తీసుకుని అంచానాలు రూపొందించింది. వీటీపీఎస్, ఆర్టీపీపీల్లో ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యమున్న 8 థర్మల్ విద్యుత్ యూనిట్లను 2025 మార్చి నుంచి మూతపడతాయంటూ ముందే తేల్చేసింది.
అయితే పర్యావరణ సమస్యల దృష్ట్యా 30 సంవత్సరాలు దాటిన థర్మల్ యూనిట్లను మూసేయాలని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో భావించినా వాటిని 2030 వరకు కొనసాగించేందుకు ఆ తర్వాత అనుమతించింది. వాటిని కనీసం 60 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌లో నిర్వహించినా ఏటా సుమారు 9000ల మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుంది. మరి అలాంటప్పుడు సెకి నుంచి కరెంట్ కొంటే దాన్ని ఏం చేయాలనే ఆలోచనే ఏపీపీసీసీ చేయలేదు. ఇక ఓపెన్ యాక్సెస్ విద్యుత్ లెక్కలనూ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పారిశ్రామిక వినియోగదారులు పగటి వేళల్లో తక్కువ ధరకు దొరికే సౌర విద్యుత్‌ను ప్రైవేట్ డెవలపర్ల నుంచి కొనుక్కునే వెసులుబాటను కేంద్రం కల్పిస్తోంది.