YSRCP Govt Negligence on Srisailam Project :వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం శ్రీశైలం ప్రాజెక్టుకు శాపమైంది. ప్రాజెక్టు నిర్వహణకు ప్రతిపాదించిన 204 కోట్ల రూపాయలు విలువైన పనులపై దృష్టి పెట్టకుండా నీరుగార్చింది. రూ.130 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు 204 కోట్లు రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ‘డ్రిప్’ పథకంలో (DRIP-Dam Rehabilitation And improvement Project) భాగంగా మొత్తం వ్యయంలో 30% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన 70% కేంద్రం సమకూర్చే అవకాశమున్నా జగన్ సర్కారు స్పందించలేదు.
ప్రస్తుతం నీటిని విడుదల చేయడంతో ప్రతిపాదిత పనులకూ అవకాశం లేకుండా పోయింది. స్పిల్‌వే నుంచి వేగంగా దూసుకొచ్చే నీటి ప్రవాహ ఉద్ధృతికి డ్యాం ముందు వంద మీటర్ల లోతున ప్లంజ్‌పూల్ (భారీ గొయ్యి) ఏర్పడింది. దానిని ఎలా పూడ్చాలన్న అంశంపై అధ్యయనమే మొదలు కాలేదు. డ్యాం గేట్ల ముందుండే ఏప్రాన్ (Apron) దెబ్బతినడంతో మరమ్మతులకు 74 కోట్ల రూపాయలు ఖర్చ అవుతుందని నిపుణులు అంచనా వేశారు. డ్యాం ఎదురు కుడివైపు భాగం పాడైందని, ఏప్రాన్ దగ్గరకు వెళ్లే మెట్లు, రోడ్ల మార్గాలూ దెబ్బ తిన్నాయని అధికారులు అధ్యయనంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
నిండుకుండలా శ్రీశైలం జలాశయం - 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - Srisailam Dam 10 Gates Lifted
ఇతర పనులూ పెండింగులోనే :వాటికి మరమ్మతులు, డ్యాం రక్షణకు అవసరమైన ఇతర పనులకు 87 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తేల్చారు. ప్రాజెక్టు పరిధిలో కొండవాలు ప్రాంతాలు కొన్ని అత్యంత ప్రమాదకరంగా మారాయని, రూ.9 కోట్లతో ‘షార్ట్ క్రీటింగ్’ (Short Cretting) పనులు చేయాలని పేర్కొన్నారు. సాంకేతిక వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 3 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు.