YSRCP Government Negligence on Amaravati: అమరావతి విషయంలో అన్నివర్గాలనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో అయిదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు. కొన్ని ప్రాంతాల్లో తూతూమంత్రంగా జంగిల్ క్లియరెన్స్ (Jungle Clearance) చేసి, తర్వాత ఆ పనులనూ ఆపేసింది. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యల కారణంగానే రైతుల ప్లాట్లు అడవిని తలపిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇక్కడ అభివృద్ధికి నిధులు వెచ్చించడం ఇష్టం లేకే నాటకాలాడుతోందని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూణ్నాళ్ల ముచ్చటగా పనులు:రాజధాని కోసం గత ప్రభుత్వం 34 వేల ఎకరాలను భూసమీకరణ విధానంలో రైతులనుంచి తీసుకుంది. ఇందుకుగాను రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఇవ్వాలన్నది ఒప్పందం. ఇలా కేటాయించిన మొత్తం ప్లాట్లు 64,735. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పేర్లతో సుమారు 40 వేలకుపైగానే ప్లాట్లను రిజిస్టర్ చేసింది. జగన్ మోహన్ రెడ్డి సర్కారు వచ్చాక ఈ ప్రక్రియను నిలిపేయడంతో రైతులు హైకోర్టుకెళ్లారు. సుదీర్ఘ విచారణ అనంతరం, అన్నదాతలకు అన్ని వసతులతో ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని రెండు సంవత్సరాల క్రితం కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం, మిగతా ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ప్రారంభించింది. సీఆర్డీఏ 13 జోన్లలో మౌలిక వసతుల కల్పన కోసం 16 వేల 400 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచింది. 11 జోన్లకు ఖరారు చేసి గుత్తేదారులను ఎంపిక చేసింది. ప్లాట్లలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం 2022 జులై నెలలో పనులను ప్రారంభించారు. కొన్నాళ్లు కంపచెట్లు తొలగించిన అనంతరం సీఆర్డీఏ మొత్తం పనులను నిలిపేసింది.
రాజధాని అమరావతి పరిధి గ్రామాల్లో భూసేకరణ రద్దు - అంతా జగనన్న ప్లానే - Land Acquisition Withdrawal
ఎవరి ప్లాట్ ఎక్కడో:రైతుల ప్లాట్లలో 16 వేల 400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. దీనికి సాక్ష్యంగా పలు చిత్రాలను జత చేసింది. తిరిగి ఏడాదిన్నర క్రితమే సీఆర్డీఏ (Capital Region Development Authority) అధికారులు ఆ పనులను నిలిపేశారు. అప్పట్నుంచి ఈనాటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. జంగిల్ క్లియరెన్స్ చేసిన ప్రాంతంలో ముళ్లకంపలు దట్టంగా పెరిగిపోయాయి. పనుల కోసం 3 వేల 500 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నట్టు చెప్పి, ఆ తరువాత మిన్నకుండిపోయింది. దీంతో బ్యాంకర్లు ముందుకు రాలేదు. విశాఖకు పరిపాలనను మార్చాలన్న తలంపుతో ఉన్న జగన్, అమరావతిని కావాలనే నిర్లక్ష్యం చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.