YSRCP Government Negligence in Tidco Houses: పేదలకు పెద్దఎత్తున ఇళ్లు కట్టిస్తున్నామంటూ ఐదేళ్లగా ఆశల పల్లకిలో ఊరేగించిన జగన్, తాను అధికార పీఠం ఎక్కేసరికే తెలుగుదేశం హయాంలో కట్టి ఉన్న టిడ్కో ఇళ్లపై శీతకన్ను వేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకూ టిడ్కో గృహాలు అనేవి రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్నే ఆయన అసలు పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు పోరాటాలు, ఆందోళనలు చేసేసరికి కొన్నిచోట్ల నిర్మాణ పనులు చేపట్టినా నత్తనడకనే కొనసాగించారు. బడ్జెట్ నుంచి డబ్బులు విడుదలయ్యేలా చేయని జగన్, అప్పులు తెచ్చుకుని కట్టుకోవాలంటూ భారం మొత్తాన్ని టిడ్కోపైనే వేసేశారు.
టీడీపీ ప్రభుత్వంలో 60 నుంచి 90 శాతం పూర్తి చేసిన ఇళ్లనూ జగన్ సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వలేదు. లబ్ధిదారుల పేరిట టిడ్కో తీసుకున్న రుణానికి మారటోరియం గడువు ముగియడంతో వాయిదాలు చెల్లించాలంటూ కొంతమందికి బ్యాంకులు తాఖీదులు ఇస్తున్నాయి. మరి కొంతమంది ఖాతాలు ఇప్పటికే నిరర్థక ఆస్తులుగా మారాయి. దాదాపుగా 5 వేలమంది వరకు ఈ జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. రాబోయే 2 నెలల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. భవిష్యత్తులో రుణాలు తీసుకునే అవకాశం ఉండదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వని వైసీపీ ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకు మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.
'వారం నుంచి నీళ్లు లేవు - మా కాలనీ వైపు చూడండి కొడాలి నాని గారూ'
టీడీపీ ప్రభుత్వం 3.13 లక్షల గృహాల నిర్మాణం చేపట్టగా, వైసీపీ అధికారంలోకి రాగానే వీటిలో 52 వేల ఇళ్లను రద్దు చేశారు. మిగతా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్నే చేపట్టింది. 365చదరపు అడుగల విస్తీర్ణం గల గృహాలపై 3.15 లక్షల రూపాయలు, 430 చదరపు అడుగల విస్తీర్ణం గల ఇళ్లపై 3.65 లక్షల రూపాయల చొప్పున లబ్ధిదారుల పేరిట రెండేళ్ల మారటోరియంతో బ్యాంకుల నుంచి టిడ్కో రుణాన్ని తీసుకుంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇలా 65 వేల మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం. మారటోరియం గడువులోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తే వారు 3 వేల చొప్పున నెలవారీ వాయిదాలు బ్యాంకులకు కట్టాలి. కానీ గృహాలను అప్పగించకముందే టిడ్కో తీసుకున్న రుణాలపై మారటోరియం గడువు ముగిసిపోతోంది. దీంతో ప్రతి నెలా పలువురు లబ్ధిదారుల అకౌంట్లు ఎన్‌పీఏలుగా మారుతున్నాయి.
అరకొర వసతులతో టిడ్కో ఇళ్లు పంపిణీ- తీవ్ర అవస్థలు, అనారోగ్యం ఇక్కట్లతో ప్రజలు
ఎన్పీఏగా మారిన లబ్ధిదారులు ఎక్కువగా విశాఖ, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. గత 2, 3 నెలల్లోనే దాదాపుగా వెయ్యి ఖాతాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. విజయవాడ, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో లబ్ధిదారులకు గృహాలను అప్పగించకుండానే వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. కొన్ని చోట్ల లబ్ధిదారులే వైసీపీ ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తున్నారు.