Buses From Tirupati to Madurai: తిరుపతి నుంచి రామేశ్వరం, మదురై, ఊటీ, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో బస్ ప్యాకేజీల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం జరిగేది. అయితే ప్రస్తుతం ఈ విధమైన దర్శన టిక్కెట్లు రద్దు కావడంతో ఆర్థికంగా నష్టపోయిన పర్యాటకాభివృద్ధి సంస్థ తమకు చెందిన బస్సులను ఇతర మార్గాల్లో వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది.
తిరుపతి నుంచి కోయంబత్తూరు, ఊటీ వయా చెన్నై: ఇందులో భాగంగా భక్తులు, పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్తగా నాలుగు స్పెషల్ బస్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. తిరుపతి నుంచి కోయంబత్తూర్‌కు ప్రతి బుధవారం బస్సు నడపనుంది. అయిదు రోజులపాటు ( 5 డేస్, 4 నైట్స్) యాత్ర ఉంటుంది. దీని టికెట్ ధర పెద్దలకు 4210 రూపాయలు, చిన్న పిల్లలకు 3370 రూపాయలుగా ఉంది.
తిరుపతి నుంచి మైసూరు, ఊటీ వయా బెంగళూరు: మరో ప్యాకేజీలో భాగంగా తిరుపతి నుంచి మైసూర్‌కు ప్రతి బుధవారం బస్సు నడపనున్నారు. ఈ టికెట్ ధర పెద్దలకు 3020 రూపాయలు, చిన్న పిల్లలకు 2420 రూపాయలుగా ఉంది. ఇది కూడా అయిదు రోజుల పాటు కొనసాగనుంది.
తిరుపతి- రామేశ్వరం-కన్యాకుమారి- మధురై- శ్రీరంగం-తిరుపతి వయా చెన్నై: మరో ప్యాకేజీ తిరుపతి నుంతి శ్రీరంగం వరకూ నాలుగు రోజుల పాటు (4 డేస్, 3 నైట్స్) ఉంది. ఇది ప్రతి గురువారం అందుబాటులో ఉంచారు. దీని టికెట్ ధరలు పెద్దలకు 5600, చిన్న పిల్లలకు 4480 రూపాయలుగా నిర్ణయించారు.
ఇక నాలుగో ప్యాకేజీ తిరుపతి నుంచి ప్రారంభమై కాణిపాకం, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ సందర్శన తరువాత తిరిగి తిరుపతికి చేరుకుంటుంది. ఇది ఒక రోజు ప్యాకేజీ. ఉదయం 6 గంటలకు మొదలై, రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. దీని టికెట్ ధర పెద్దలకు కేవలం 1200 రూపాయలు మాత్రమే ఉంది. చిన్న పిల్లలకు 960 రూపాయలుగా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీలలో అల్పాహారం, భోజన సదుపాయం, వసతి కల్పించేవి కూడా ఉన్నాయి. అంతే కాకుండా మల్టీ యాక్సిల్ ఏసీ వాల్వో ఒక్కో బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో 40 సీట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్స్ కోసం ఏపీటీడీసీ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. టికెట్ల ధరలు, ఇతర వివరాలకు 9848007024, 9848850099, 9848973985 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారులు సూచించారు.
ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ - కుంభమేళాకు వెళ్లేవారికి ప్రత్యేకంగా బస్సులు
కాశీ వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం - IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ