Papagni River Bridge in Kamalapuram : 2021 నవంబర్ 20న భారీ వరదల కారణంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం సమీపంలోని పాపాగ్నినదిపై నిర్మించిన 50 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలిపోయింది. నదిలో 30 వేల క్యూసెక్కులకు మించి వరద ప్రవాహం రావడంతో శిథిల వంతెన కూలిపోయింది. ఫలితంగా కడప నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను దాదాపు మూడు నెలల పాటు దారి మళ్లించారు. ఈ సందర్భంలో తాత్కాలికంగా 4 కోట్ల రూపాయల తో గత వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు అప్రోచ్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసిన కొన్నాళ్లకే వరదకు కొట్టుకుపోయింది. మరోసారి కోట్ల రూపాయలు వెచ్చించి మళ్లీ అప్రోచ్ రోడ్డు వేశారు. శాశ్వత వంతెనకు నిధులు కేటాయించక పోవడంతో తీవ్ర జాప్యం జరిగింది.
ఎన్నికలకు ఏడాది ముందు కొత్త వంతెన నిర్మించడానికి టెండర్లు పిలిచారు. 70 కోట్ల రూపాయలతో 570 మీటర్ల పొడవున వంతెన నిర్మిస్తున్నారు. నాలుగు వరసల రహదారిలో భాగంగా నిర్మిస్తున్న వంతెనను అత్యవసరంగా ఒక వైపు మాత్రం వంతెన నిర్మిస్తుండగా త్వరలో చేపట్టే ముద్దనూరు-కడప ప్రాజెక్టులో మరోవైపు వంతెన రహదారి నిర్మిస్తామని అధికారులు అంటున్నారు. ఈ కొత్త వంతెనకు 25 పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు.
గుణదల రైల్వే పై వంతెన నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం: ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
గతంలో కూలిన వంతెన స్థానంలో కాకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో పాపాగ్నినదిలో సమాంతరంగా కొత్త వంతెన నిర్మాణం సాగుతోంది. పాత వంతెన భూమిపైనే పునాది ఉండగా ఇపుడు కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు భూమి లోపలకు 15 మీటర్ల వరకు పునాది వేసి ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునే విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పనులు నిలిచిపోవడమే ప్రధాన అవరోధంగా మారింది. వంతెన నిర్మాణం సందర్భంగా అలైన్మెంట్ ఏర్పాటు చేసే క్రమంలో అటవీశాఖ పరిధిలోని భూమిలో వంతెన నిర్మిస్తుండటంతో ఇపుడు అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.
గతంలో పని చేసిన డీఎఫ్ఓ సూచించిన మేరకు జాతీయ రహదారుల విభాగం వంతెన నిర్మిస్తుండగా తర్వాత వచ్చిన డీఎఫ్ఓ సందీప్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ కొర్రీలు వేస్తుండటంతో రాష్ట్ర స్థాయిలోనూ అటు దిల్లీ స్థాయిలో మాట్లాడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని జాతీయ రహదారుల విభాగం ఈఈ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.
ఒకవేళ అటవీశాఖ అధికారులు వంతెన నిర్మాణానికి అంగీకరించపోతే 50 శాతం నిర్మించిన వంతెన వృథా అవుతుందనే ఆందోళన అధికారుల్లో నెలకొంది. ఏదో విధంగా సీఎం స్థాయిలో చర్చలు జరిపి అటవీశాఖ అధికారులను ఒప్పించాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే జనవరి నాటికి కొత్త వంతెనలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు.
హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge