YSRCP Club House in Pulivendula :కూటమి గెలుపుతో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అరాచకాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం కె.వెలమవారిపల్లెలోని విజయ హోమ్స్‌కి చెందిన క్లబ్‌హౌస్ విస్తీర్ణం 2.17 ఎకరాలుగా అప్పటి కలెక్టర్ విజయరామరాజు 2022 నవంబరు 11న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకి రాసిన లేఖలో సిఫార్సు చేశారు. మొత్తం 4 కోట్ల 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని పర్యాటకాభివృద్ధి సంస్థకు కలెక్టర్ సూచించారు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లబ్ హౌస్ విస్తీర్ణం 1.71 ఎకరాలుగా తేల్చారు.
సార్వత్రిక ఎన్నికల్లోగా పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది. సీఎంవో ఆదేశాలపై పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. హోటల్ నిర్మాణానికి 23.50 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశారు. పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు 2022 ఏప్రిల్ 18న అప్పటి సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ సర్వసభ్య సమావేశంలో బీజం పడింది. ఇందుకోసం నాలుగు స్థలాలను తెరపైకి తీసుకొచ్చి వాటిలో నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి బావ విజయశేఖర్‌రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్‌ని ఖరారు చేశారు.