YS Jagan Mohan Reddy Submit Letters To NCLT : సరస్వతి పవర్ కంపెనీ అనే సంస్థ వాటాలను బోర్డు అక్రమంగా బదలాయించిందంటూ తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అందులో ఏవిధంగానైనా పైచేయి సాధించాలని అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే చెల్లి షర్మిలతో జరిపిన పలు ఉత్తర ప్రత్యుత్తరాలను ట్రైబ్యునల్ ముందుంచారు.
సోదరితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు : సరస్వతి కంపెనీలో తమ వాటాలను తల్లి విజయమ్మ పేరుతో సరస్వతి పవర్ బోర్డు అక్రమంగా బదలాయించిందని వ్యాఖ్యానించారు. వాటిని రద్దు చేయాలంటూ హైదరాబాద్ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) వైఎస్ జగన్, ఆయన భార్య భారతీ రెడ్డిలు పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికి విధితమే. ఈ పిటిషన్‌లో ప్రతివాదులైన షర్మిల, విజయమ్మ, చాగరి జనార్దన్‌రెడ్డి, ఆర్వోసీ, సరస్వతి పవర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులపై ప్రతివాదులు స్పందించక ముందే సోదరి షర్మిలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను జగన్ ట్రైబ్యునల్ ముందు ఉంచారు.
వైఎస్ జగన్ షర్మిలకు లెటర్ : ఒప్పందం రద్దు చేయడంతో పాటు ఆస్తుల్లో వాటాను ఇవ్వకపోతే తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని వైఎస్ జగన్ షర్మిలకు సెప్టెంబరు 12న లేఖను రాశారు. దీనిపై స్పందించిన "తండ్రి ఉండగానే ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయి. ఆయన మరణించి పదేళ్లయింది. పెళ్లయి 20 ఏళ్లు అయినప్పటికీ ప్రేమతో ఆస్తుల్లో వాటా ఇద్దామని ఒప్పందం కుదుర్చుకున్నాను. అయితే రాజకీయంగా, వ్యక్తి గతంగా షర్మిల చేసిన ఆరోపణలతో ప్రేమ లేదని తెలిసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాను' అని సెప్టెంబరు 17న జగన్ షర్మిలకు రాసిన లెటర్లో పేర్కొన్నారు.