VIVEKA MURDER CASE: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్ ఆధారంగా అవినాష్ రెడ్డి, డాక్టర్ చైతన్యరెడ్డి, పీఏ కృష్ణారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఏ-5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి కడప జైల్లో అప్రూవర్ దస్తగిరిని బెదిరించారనే అభియోగాలపై అతనికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా జైల్లో జరిగిన బెదిరింపులపై విచారణ జరిపే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
డాక్టర్ చైతన్యరెడ్డికి తొలిసారిగా నోటీసులు:పులివెందులకు చెందిన వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిల బెయిలు రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేసులో ఏ-8గా ఉన్న అవినాష్ రెడ్డి కీలక నిందితుడని, అతను బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారనే ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఫలితంగా సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్యరెడ్డికి తొలిసారిగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ కావడం చర్చనీయాంశమైంది. 2023 నవంబర్‌లో కడప జైల్లో ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్రూవర్ దస్తగిరిని వైద్యశిబిరం ఏర్పాటు పేరిట జైలుకు వెళ్లి డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని గతంలో పలుమార్లు దస్తగిరి మీడియా ఎదుట, సీబీఐ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బ్యారెక్‌లో ఉన్న దస్తగిరిని బెదిరించాడని ఆరోపణలు: ఏ-5 నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు కడపలో శంకర్ ఆసుపత్రిని నడిపిస్తున్నాడు. గత ఏడాది కడప జైల్లో అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ సహకారంతో జైలుకు వెళ్లారు. ఖైదీలకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత బ్యారెక్‌లో ఉన్న దస్తగిరిని బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో తాము చెప్పినట్లు రాజీకి రావాలని, అలా వస్తే కోట్ల రూపాయలు ఇస్తామని డాక్టర్ చైతన్యరెడ్డి ప్రలోభ పెట్టినట్లు గతంలో దస్తగిరి సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. లేదంటే బయటికి వచ్చిన తర్వాత అంతు చూస్తామని హెచ్చరించినట్లు దస్తగిరి వాపోయాడు.
అప్పటిలోపు సమాధానం చెప్పాలని ఆదేశం: దస్తగిరి గత ప్రభుత్వంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీస విచారణ కూడా చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరుణంలో కడప జైల్లో జరిగిన వ్యవహారంపై విచారణ జరిగే వీలుందని తెలుస్తోంది. కేసులో ఉన్న తండ్రి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కోసం ప్రలోభాలకు తెరలేపిన డాక్టర్ చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నుంచి నోటీసులు రావడం వైఎస్సార్సీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వచ్చే ఏడాది మార్చిలోపు నోటీసులు అందుకున్న వారు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కడప జైల్లో దస్తగిరిని బెదిరించిన వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించే విధంగా వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కూడా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును క్వాష్ చేయాలని ముగ్గురు వేర్వేరుగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం వివేకా పీఏ కృష్ణారెడ్డికి కూడా నోటీసులు పంపింది. ఇప్పటికే కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పోలీసు విచారణ పులివెందులలో మొదలైంది. మంగళవారం సునీత దంపతులు సీఎంఓ కార్యాలయానికి వెళ్లి కేసు విషయంపై చర్చించినట్లు తెలిసింది.
తాడేపల్లి ఇంట్లో జగన్ - అసెంబ్లీకి సునీత - ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం?!