YS Sharmila Election Campaign: పులులు, సింహాలు అని చెప్పుకునే జగన్, బీజేపీని చూసి పిల్లిలా అయ్యారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని వైఎస్సార్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ న్యాయ యాత్ర ఎన్నికల ప్రచార బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు.
ప్రతిపక్షంలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి మడకశిర నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. అధికారంలోకి వస్తే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఆ హామీని మరిచారని విమర్శించారు. అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నారని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఇక లెదర్ పార్కు హామీని సైతం మరిచారని షర్మిల మండిపడ్డారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన జగన్ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. వీటిలో ఏ ఒక్కటైనా సాధించారా అంటు జగన్పై ధ్వజమెత్తారు.
మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ప్రజలను కూడా అమ్మేస్తారు: షర్మిల - YS Sharmila Warning To YS Jagan
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడని చెప్పుకుంటూ ఆయన ఆశయాలకు నీరుగారుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓటు వేసే సమయం వచ్చిందని, ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఆయుధం మీ చేతికి వస్తుందని అన్నారు. దీన్ని వృథా చేస్తే మీతో పాటు మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందని షర్మిల తెలిపారు. మీకోసం అహర్నిశలు కష్టపడి మీ ముందుండే నాయకుడికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది అని, దానితో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని షర్మిల తెలిపారు. కానీ ఈ విషయంలో బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ తాకట్టు పెట్టారని, ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రంలో రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ఏపీ గురించి పట్టించుకోని జగన్ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించిన షర్మిల, హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. ఈ హామీని ఏఐసీసీ మేనిఫెస్టోలో సైతం పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు.
నగరిలో రోజా దోపిడీకి అడ్డేలేదు- ఆమె ఇంట్లో నలుగురు మంత్రులు : షర్మిల - YS Sharmila on Roja