Rushikonda Palace : ఆ భవనాలను చూస్తే మనం ఇంకా రాజుల పాలనలో ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భవనాల నిర్మాణానికే సుమారు రూ.410 కోట్లు అయిందంటే మాటలా! పైగా ఒక కొండను ఏకంగా చెక్కేసి నియంతలా భవనాలను నిర్మించారు. ఆ భవనాల ప్రధాన ద్వారానికి పెట్టిన తలుపు ఖర్చు (గ్రిల్‌తో సహా) ఎంతో తెలుసా? అక్షరాలా రూ.31,84,247 అంటే మనకు ఒక డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టేయొచ్చు. దీనికే వామ్మో అంటే ఎలా? ఇంకా కమోడ్, బాత్రూమ్లో ఒక్కో షవర్, ఫ్యాన్ వంటి వాటికి ఎంత అయ్యాయో తెలుసా? ఆ రాజభవనం ఎక్కడుందో తెలుసా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో. కట్టించింది ఆ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఏపీలో గత ఐదేళ్లు అరాచక పాలన జరిగిందనడానికి ఇదో నిదర్శనం. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు నియంతలా ప్రజల సొమ్మును నీరులా ఖర్చు చేసి విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ ఇది. ఈ ప్యాలెస్‌లో ప్రధాన ద్వారానికే రూ.31 లక్షలు ఖర్చయిందని సమాచారం. బాత్రూమ్లో అమర్చిన వాల్ మౌంటెడ్ కమోడ్ ధర రూ.11,46,840. బాత్రూమ్లో ఒక్కో షవర్‌కి పెట్టిన ఖర్చు రూ.44,640 పైమాటే. ఈ లెక్కలు చూస్తేనే సామాన్యుల కళ్లు గిర్రున తిరిగేలా ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణంపై చేసిన ఖర్చు సమాచారాన్ని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు సేకరించారు. ఆయన సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
ప్యాలెస్ ఖర్చుల వివరాలు :
- రుషికొండ ప్యాలెస్‌లో వాడిన ఒక బాత్ టబ్, కమోడ్, ప్రధాన తలుపు ఖరీదుతో విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో కుటుంబానికి అవసరమైన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వచ్చేస్తుంది.
- ప్యాలెస్ ప్రధాన డోర్లకు రూ.31.84 లక్షలు చొప్పున ఖర్చు చేశారు.
- ఇతర తలుపులు ఒక్కో దానికి రూ.17,93,658 చొప్పున వెచ్చించారు.
- బాత్రూమ్లలోని ఒక్కో బాత్‌టబ్‌కు పెట్టిన ఖర్చు రూ.12,38,771.
- ఒక్కో వాష్ బేసిన్‌కి పెట్టిన ఖర్చు రూ.2,61,500.
- ప్రధాన ప్రవేశ ద్వారం ముందు అలంకరణం కోసం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఆర్సీసీ సర్క్యులర్ కాలమ్స్‌కి ఒక్కో దానికి రూ.9,11,719. ఇలా మొత్తం ఎనిమిది కాలమ్స్‌కి రూ.72,93,752 ఖర్చు చేశారు.
- కాన్ఫరెన్స్ టేబుల్ ఖరీదు రూ.24.37 లక్షలు.(12.92 మీటర్ల పొడవు).
- 15 మీటర్ల పొడవులున్న ఆంగ్ల అక్షరం యు ఆకారపు టేబుల్ ఖరీదు రూ.53,73,700.