YS Jagan Petition in NCLT :వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని సమాచారం. తాజాగా జగన్ కోర్టును ఆశ్రయించడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని జగన్, ఆయన భార్య భారతి రెడ్డిలు పిటిషన్లో కోరారు.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వైఎస్ జగన్కు షేర్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని వారు పిటిషన్ దాఖలు చేశారు