YS Jagan Passport Renewal Issue: పాస్ పోర్టు పునరుద్ధరణపై (రెన్యూవల్) విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తనపై విజయవాడ కోర్టులో 2018లో నమోదైన పరువునష్టం కేసు గురించి జగన్‌కు తెలుసని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. నేర చరిత్ర గురించి ఎన్నికల సంఘానికి(ఈసీ) తెలియజేసే క్రమంలో 2019, 2024 సంవత్సరాలకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్‌లో పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని నంబరుతో సహా ప్రస్తావించారన్నారు. పాస్‌పోర్టు ఆఫీసుకు తాజాగా వెళ్లాకే పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందని అసత్యం చెబుతున్నారన్నారు.
పరువునష్టం కేసులో విజయవాడ ప్రత్యేక కోర్టు పంపుతున్న సమన్లను హోదాను అడ్డుపెట్టుకొని జగన్ అందుకోవడం లేదన్నారు. అయిదున్నరేళ్లుగా పరువునష్టం కేసు విచారణను సాగదీస్తున్నారన్నారు. ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు విచారణను హైకోర్టు స్టే ఇచ్చిందని జగన్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు.
వైఎస్ జగన్ పాసుపోర్టు కష్టాలు- లండన్ ప్రయాణం ఎలా? - High Court on Jagan Petition
షరతులు సహేతుకమే: విజయవాడ కోర్టు జగన్‌కు తాజాగా మరోసారి సమన్లు జారీచేసిందని, విచారణను ఈనెల 29కి వాయిదా వేసిందని గుర్తుచేశారు. ప్రత్యేక కోర్టులో కేసు విచారణను హైకోర్టు స్టే చేసిందని, తనపై నమోదైన పరువునష్టం కేసు గురించి తెలీదంటూ జగన్ హైకోర్టును తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. వాస్తవాలను దాచిపెడుతున్నారన్నారు. జగన్ పాస్‌పోర్ట్‌ను ఏడాది మాత్రమే రెన్యువల్ చేయాలని, తమ ముందు హాజరై రూ. 20వేల స్వీయ బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేన్నారు. వాటి విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. ప్రస్తుత కేసు విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు.
పాస్‌పోర్టు పునరుద్ధరణకు విజయవాడ కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో ఇరువైపు వాదనలు ముగిశాయి. ఈనెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే.కృపాసాగర్ ప్రకటించారు. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ వ్యవహారంలో నిరభ్యంతరపత్రం(NOC) ఇచ్చేందుకు విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 5న కఠిన షరతులు విధించిందని పేర్కొంటూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన విచారణలో జగన్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.