పాలనంతా దాడులు, దందాలు - విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ (etv bharat) YS Jagan Mohan Reddy Anarchy Rule: 2019 ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు భారీ మెజారిటీ కట్టెబెట్టారు. దాన్ని జగన్ ఓ పెత్తనంగా, అరాచకాలకు లైసెన్స్ ఇచ్చినట్లుగా భావించారు. లేకపోతే 7 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను నేలమట్టం చేయడమేంటి? ప్రతిపక్ష నేత హోదాలో తన కార్యకలాపాల కోసం ప్రజావేదికను కేటాయించాలని ప్రభుత్వానికి చంద్రబాబు లేఖకూడా రాశారు. ఏమాత్రం పట్టించుకోని జగన్ బుల్డోజర్లను దించి కూలగొట్టించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభకు స్థలమిచ్చారనే కక్షతో ఇప్పటం అనే చిన్న గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట పేదల ఇళ్లు కూల్చారు. విశాఖ పచ్చదనానికి అండగా ఉండే రుషికొండకు గుండుకొట్టి 450 కోట్లతో ఏకంగా ప్యాలెస్ నిర్మించుకున్నారు.
ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటూ: గద్దెనెక్కింది మొదలు, ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటూ జగన్ చేసింది ధ్వంస రచనలే. దానికి భారీ మూల్యం చెల్లించుకుంది ఆంధ్రుల కలల.రాజధాని అమరావతే. రాజధాని లేని రాష్ట్రం కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూములిచ్చి అమరావతి నిర్మాణానికి బాటలు వేస్తే అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే జగన్ దాన్ని నాశనం చేశారు. నా ఇల్లు ఇక్కడే, అమరావతీ ఇక్కడే అంటూ 2019 ఎన్నికల్లో నమ్మబలికారు జగన్. గొర్రె కసాయిని నమ్మినట్టు, రాజధాని ప్రాంత ప్రజలు జగన్‌కే జైకొట్టారు. కానీ కుర్చీ ఎక్కాకే, జగన్‌లోని అపరిచితుడి బయటికొచ్చాడు.
మూడు రాజధానులంటూ పసిగుడ్డుగా ఉన్న అమరావతి అంగిట్లో వడ్లగింజలు వేశారు. ఎక్కడి పనుల్ని అక్కడే ఆపేసి రాజధాని ప్రాంతాన్ని నిర్మానుష్యం చేశారు. గుండెమండి రోడ్డెక్కిన రైతులపట్ల పైశాచికంగా ప్రవర్తించారు. 3 రాజధానులు కుదరదని హైకోర్టు చెంపలు వాయించినా జగన్ దులపరించేసుకుని సుప్రీంకోర్టు గడపతొక్కారు. మొత్తానికి అయిదేళ్లలో రాజధానిలో ఒక్క ఇటుకా పేర్చలేదు, తట్ట మట్టీ పోయించలేదు. రివర్స్‌లో రాక్షస మూకలు రోడ్లు తవ్వేసుకుపోతుంటే అడ్డుకోకుండా రాక్షసానందం పొందారు.
గొంతెత్తితే దౌర్జన్యాలు - ఎదురు తిరిగితే హత్యలు - దళితులపై వైఎస్సార్సీపీ దాష్టీకాలు - Attacks on Dalits in Andhra Pradesh
శాడిజంలో మరో అంకం: ఇక జగన్ శాడిజంలో మరో అంకం విపక్షాలపై కేసులు, కక్ష సాధింపులు. సీబీఐ, ఈడీ కేసులతో 16 నెలలు జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సీఎం కాగానే ప్రతిపక్ష పార్టీలో కీలక నేతలందరినీ ఎలాగైనా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. రెండు లక్షల మందికిపైగా యువతీయువకులకు నెపుణ్యాలు నేర్పించిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లపైనే బురదచల్లి చంద్రబాబును జైలుకు పంపేవరకూ జగన్ శాంతించలేదు. వైఎస్సార్సీపీకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని సీఐడీతో అరెస్ట్ చేయించి కస్టడీలో కమిలిపోయేలాకొడితేగానీ, జగన్ మనసు కుదుటపడలేదు.
రాజకీయకక్షతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వంటి నేతలెందరినో కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావైతే కేసుల వేధింపులు భరించలేక మానసిక క్షోభకుగురై ఆత్మహత్య చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు పెట్టారు. లోకేష్‌పై 23, అచ్చెన్నాయుడిపై 21, చింతమనేనిపై అత్యధికంగా 47 కేసులు, పులివర్తి నానిపై 28, కొల్లు రవీంద్రపై 25, అయ్యన్నపాత్రుడిపై 17, చల్లా బాబుపై 17, ధూళిపాళ్ల నరేంద్రపై 16, రఘురామకృష్ణరాజుపై 11, బీటెక్ రవిపై 8 కేసులు నమోదు చేశారు.
టీడీపీ దళిత నాయకులైన ఎంఎస్ రాజు, వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య సహా పలువురిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించారు. ప్రజాస్వామ్యం పొడ గిట్టని జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో తొక్కిసలాటను సాకుగా చూపి రోడ్లపై సభలు, ర్యాలీల్ని నిషేధిస్తూ అర్ధరాత్రి జీవో జారీచేశారు. ఆ జీవోతో లోకేష్ పాదయాత్రనూ అడ్డుకోవాలని చూశారు. చివరకు హైకోర్టే ఆ చీకటి జీవోను చెత్తబుట్టలోవేసి జగన్ చెంప చెల్లుమనిపించే ఆదేశాలిచ్చింది.
ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం - ఊరూరా వైఎస్సార్సీపీ నేతల అరాచకం - YCP Irregularities
సీఐడీని తన జేబు సంస్థలా మార్చుకుని: వ్యవస్థలనూ జగన్ విధ్వంసం చేశారు. ఏ ప్రభుత్వమూ వాడుకోని రీతిలో సీఐడీని తన జేబు సంస్థలా మార్చుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఎవరు గళమెత్తినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టినా సీఐడీ వెంటాడి, వేటాడి కేసులు పెట్టింది. కొందరిపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి రాక్షసానందం పొందింది. ఎల్జీ పాలిమర్స్‌లో వాయువు లీకేజీ ఘటనపై సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టినందుకు గుంటూరుకు చెందిన వృద్ధురాలు రంగనాయకమ్మపై సీఐడీ కేసుపెట్టి వేధించింది. ఓ పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు నరకం చూపించారు.
మాజీ మంత్రి గంటా అనుచరుడైన నలంద కిశోర్‌ను ఇదేవిధంగా కేసుపెట్టి, కరోనా సమయంలో తిప్పి వేధించడంతో ఆయన చనిపోయారు. ప్రతిపక్షాల్ని బండ బూతులు తిట్టంచి, పార్టీల కార్యాలయలపై బండలు వేయించే సంస్కృతికీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తెరలేచింది! డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలోకి వైఎస్సార్సీపీ రౌడీమూకలు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించాయి. అలాంటి ఘటనల్ని ఖండించాల్సిన జగనే వారి మనసు ఏం నొచ్చుకుందో’ అని వెనకేసుకు రావడం ఆయన శాడిజానికి పరాకాష్ట!
రాజధాని పర్యటనకెళ్లిన చంద్రబాబు బస్సుపై రాళ్లు విసిరితే, నిరసన తెలపడం రాజ్యాంగ హక్కంటూ నాటి డీజీపీ గౌతం సవాంగ్ వైఎస్సార్సీపీ ఆకతాయిలకు వంతపాడారు! కొడాలి నాని, పేర్ని నాని, రోజా, జోగి రమేశ్ వంటి జగన్ ముఠా నాయకులైతే రాయితో దాడి చేయడం తప్పుకాదనేలా మాట్లాడారు. కానీ, విజయవాడలో జగన్‌కు గులకరాయి తగిలితే, అది హత్యాయత్నమంటూ నానాయాగీ చేశారు. చిత్తూరు జిల్లా అంగళ్లు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు లక్ష్యంగా వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశారు. భద్రతా సిబ్బందిని గాయపరిచారు. రౌడీల్ని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపై దాడికి తెగించిన జోగి రమేశ్‌కు ఏకంగా మంత్రి పదవి కానుకగా ఇచ్చారు జగన్.
పోలీసులపైనా వైసీపీ మూకల దాష్టీకాలు- ఐదేళ్లుగా దాడులు, దౌర్జన్యాలతో బెంబేలు - YSRCP Attacks on Police Employees
మృతదేహాన్ని వాళ్ల ఇంటికే డెలివరీ: పాలనలో కులాలు చూడం అంటూ చెప్పిన జగన్ తన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏ కులాన్నీ వేధించకుండా వదల్లేదు. కొవిడ్ సమయంలోమాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్‌చేసి, నడిరోడ్డుపై చేతులు కట్టేసి, మానసిక రోగి అనే ముద్ర వేశారు. ఆ క్షోభతో ఆయన 55 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇక దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి, మృతదేహాన్ని వాళ్ల ఇంటికే డెలివరీ చేశారు.
గతంలో దళిత యువకులకు శిరోముండనం చేయించిన కేసులో దోషిగా తేలిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో మండపేట వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు! సామాన్యులపై కిందిస్థాయి వైఎస్సార్సీపీ నాయకులు దౌర్జన్యాలకు కొదవేలేదు. ఒక నేత ఓ అర్చకుడిని చర్నాకోలాతో కొడితే, మరొకచోట ఏకంగా అర్చకుని మెడలో జంధ్యమే తెంచేశారు. కాకినాడలో ఒక వైఎస్సార్సీపీ నేత అర్చకునిపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ మంత్రుల మాటతీరు బాగోలేదని చెప్పడమే తప్పన్నట్లు ఒంగోలులో సొంత పార్టీకే చెందిన సుబ్బారావు గుప్తాపై దాడిచేసి నరకం చూపించారు.
రాష్ట్రాన్ని హిట్లర్‌లా పాలించిన జగన్, ఎక్కడికక్కడ సామంత రాజులను తయారు చేసి, వారికి కర్రపెత్తనమిచ్చారు. పుంగనూరును పెద్దిరెడ్డికి, చంద్రగిరిని చెవిరెడ్డికి, తిరుపతిని భూమన కరుణాకర్‌రెడ్డికి, మాచెర్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, కాకినాడను ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి, గుడివాడను కొడాలి నానికి, మచిలీపట్నాన్ని పేర్ని నానికి, రంపచోడవరం దాని చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాన్ని అనంతబాబుకు అప్పగించారు! అధికార యంత్రాంగాన్ని వారికి సాగిలపడేలా చేశారు! ఇక ఆయా ప్రాంతాల్లో వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం.! విపక్షాలు గొంతెత్తితే దౌర్జన్యాలు, దాడులతో భయోత్పాతం సృష్టించడమే.
వైసీపీ నేతల అధికార గర్వం - అర్చకులపై ఆగని దాడులు - YSRCP Leaders Attacks on Priests
నిరంతరం దాడులు: భారత చైతన్య యుజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. అక్రమాస్తుల కేసుల్లో భాగస్వామిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యుడిగా నియమించిప్రశాంత విశాఖలో అశాంతి రేకెత్తించారు. కొందరు కడప నేతలు కొందరు విశాఖలో మకాంవేసి వాళ్లు కన్నేసిన భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి, బెదిరించి, భయపెట్టి తమ వశం చేసుకున్నారు. దాదాపు 8వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని గుప్పిటపట్టారు.
సొంత మనుషుల్నీ వదిలేదిలేదని: జగన్ ఉస్కో అంటే కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్, పేర్ని నాని, జోగి రమేశ్, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్‌నాథ్ కాస్కో అన్నట్లు స్వైరవిహారం చేసేవారు! నా తల వెంట్రుక కూడా పీకలేరని సాక్షాత్తూ జగనే నోరుపారేసుకుంటే ఆయన వీరభక్త మంత్రులు తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు ప్రతిపక్ష నేతల్ని నోటికొచ్చినట్లు తిట్టారు. వ్యక్తిత్వ హననానికి దిగారు. తోడబుట్టిన చెల్లి షర్మిల గురించీ కామెంట్ చేసి తన రాజకీయంలో వేలుపెడితే సొంత మనుషుల్నీ వదిలేదిలేదని చెప్పకనే చెప్పిన క్షుద్రపాలకుడు జగన్!
వైఎస్సార్సీపీ సర్కార్ అరాచక నిర్ణయాలకు కళ్లెంవేసే కోర్టుల్నీ జగన్ చేయలేదు. అనేక ఏకపక్ష నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేస్తే, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఏకంగా జడ్జిలనే సామాజిక మాధ్యమాల్లో తిట్టిపోశారు! హైకోర్ట్ వెంటపడితేగానీ నిందితులపై కేసులు పెట్టలేదు. తన మాటవినని వ్యక్తుల్నైనా, వ్యవస్థనైనా అడ్డుతొలగించుకోవడమే జగన్ రాజ్యాంగం!
కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేసిన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించేందుకు క్షుద్ర రాజకీయం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ పంచాయత్‌రాజ్ చట్టాన్ని ఆగమేఘాలపై సవరించారు. చివరకు ఆ చట్టసవరణ చెల్లదని న్యాయస్థానాలు తేల్చిచెప్పాయి! ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్ ఉండగా, ఆయన్ను జగన్ డమ్మీని చేశారు. జగన్ తలలో నాలుకలా వ్యవహరించే నిఘా విభాగాధిపతిని కార్యదర్శిగా నియమించి ఏపీపీఎస్సీని నడిపించారు.
ఇసుక అక్రమ తవ్వకాలు - కోడ్ ఉన్నా ఆగని దోపిడీ - YCP LEADERS ILLEGAL SAND MINING
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతీ బలి: జగన్ అరాచకాలకు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతీ బలైంది. అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న చందంగా జగన్ రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ తేకపోగా ఉన్నవాటినీ వేధించి వెళ్లగొట్టారు! తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీపై బురదచల్లి చివరకు ఆ పరిశ్రమ విస్తరణ ప్లాంట్‌ను తెలంగాణ వెళ్లేలా తరిమేసింది! చంద్రబాబు తెచ్చిన కియా లాంటి ఒక్క భారీ పరిశ్రమనూ జగన్ తేలేకపోయారు. అనంతపురం శివారులో పరిశ్రమ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం జాకీ సంస్థను ఒప్పిస్తే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసూళ్ల దెబ్బకు జడిసి ఆ సంస్థ పారిపోయింది.
ఇలా రాష్ట్ర పేరుప్రతిష్ఠలను మసకబార్చిన జగన్, తన పేరును బలవంతంగా జనంపై రుద్దుతున్నారు. రాష్ట్రంలోని పథకాలు, కాలనీలు, రోడ్లు అన్నింటికీ జగన్, రాజశేఖర్‌రెడ్డి పేర్లే! చివరకు విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరును పీకేసి వైఎస్సార్ పేరు పెట్టుకునేంత తెంపరితనానికి తెగించారు. రాష్ట్రం కోసం కొందరు పాలకులు సీఈఓల తరహాలో శ్రమిస్తారు. కానీ, జగన్ మద్యం, ఇసుక వ్యాపారి అవతారమెత్తారు. వైఎస్సార్సీపీ బడానేతలతో మద్యం తయారు చేయించారు.
ఆ పిచ్చిబ్రాండ్లను ప్రభుత్వంతోనే రెండు, మూడు రెట్లు అధిక ధరలకు అమ్మారు. ఉచిత ఇసుకను రద్దుచేసి, తొలుత బినామీలకు, ఆ తర్వాత కుటుంబీకుడికి రేవులు అప్పగించారు! ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన దాదాపు 3 వేల కోట్లు దోచుకొని, దాచుకున్నారు. రాష్ట్రంలో లాభసాటి వ్యాపారాలు, కాంట్రాక్టులు, వనరులన్నీ ప్రభుత్వంలోని కీలక పెద్దలే తీసుకున్నారు. నెల్లూరులో క్వార్ట్జ్ దందాను కీలక నేత, సిలికా శాండ్‌ను మరో నేత గుప్పిటపట్టారు. విద్యుత్ ప్రాజెక్టుల్లో కడపకు చెందిన సీఎం సన్నిహితుల సంస్థ షిర్డీసాయికి భారీ ప్రయోజనాలు చేకూర్చారు.
వైసీపీ పాలనలో అటకెక్కిన పట్టణాభివృద్ధి - ప్రగతి పనులను పట్టించుకోని జగన్ - NO DEVELOPMENT IN YSRCP REGIME