Jagan Meets Family Members In Pulivendula : ఏపీలో జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వాటాల వివాదం వైఎస్ కుటుంబంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. దీంతో మాజీ సీఎం ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలతో షర్మిల ఉక్కిరిబిక్కిరి చేస్తుండటం తల్లి విజయమ్మ కూడా షర్మిలకు వత్తాసు పలుకుతూ జగన్ చేసింది అన్యాయమనేలా ప్రకటన విడుదల చేయడం వైసీపీ అధినేతకు మింగుడుపడటం లేదు. షర్మిల, విజయమ్మ ప్రకటనలు ఏపీలోని తన పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయనే ఆందోళనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత జగన్ ఐదేళ్ల నుంచి ఎప్పుడు ఇడుపులపాయ, పులివెందుల వచ్చినా కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లింది చాలా అరుదు. ఉంటే ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లేదంటే పులివెందుల క్యాంపు కార్యాలయానికి వెళ్లేవారు. తనను కలవాలంటే ఎవరైనా ఆ రెండు ప్రాంతాలకు రావాల్సిందే. అలాంటిది రెండు రోజుల నుంచి పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ పలువురు కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లి వారిని కలుస్తుండటం చర్చనీయాంశమైంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన కుటుంబ ఆస్తుల్లో తనకూ వాటా రావాలని షర్మిల డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆమెకు మద్దతుగా విజయమ్మ కూడా నిలవడం జగన్ జీర్ణించుకోలేని పరిస్థితి. తల్లి కూడా తాను చేసింది తప్పనేలా.. బహిరంగ ప్రకటన విడుదల చేయడం ఈ వివాదం ఎటువైపు దారితీసి కుటుంబానికి, పార్టీకి నష్టం చేకూరుస్తుందోననే ఆందోళన జగన్‌లో మొదలైనట్లు తెలుస్తోంది.
బంధువుల ఇళ్లకు జగన్ : రెండోరోజు పులివెందుల పర్యటనలో జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో చాలాసేపు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విజయమ్మ లేఖపై దుమారం రేగుతున్న వేళ ఏ విధంగా రాజీ కుదుర్చు కోవాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. జగన్ అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో దాదాపు అరగంట పాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆస్తుల విషయంలో విజయమ్మతో రాయబారం నెరిపే అంశంపై ప్రకాశ్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. ఈయన ఇంటికే కాకుండా మరో ఇద్దరు సన్నిహితుల ఇళ్లకు జగన్ వెళ్లారు.