YS JAGAN LETTER TO ASSEMBLY SPEAKER :ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శాసనసభాపతికి వైఎస్ జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో తెలిపారు.
విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. పార్లమెంట్లోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదన్నారు.
కూటమి, స్పీకర్ శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు :అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తనపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు.చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేస్తున్నానన్నారు.
1984లో లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుందని, సభలో 10 శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని తెలిపారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించిందని, 10 శాతం సీట్లు కాంగ్రెస్కు లేకపోయినప్పటికీ పి.జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని తెలిపారు.
Ys Jagan Seeks Opposition Status in AP Assembly :2015లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 శాతం ఓట్లను సాధించిందని, ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన తమపై ఉందన్నారు. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుందని, దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారన్నారు.