YS Jagan Comments on President Rule: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న దారుణాలను చూసీ చూడకుండా వెళ్లకుండా గవర్నర్ అబ్దుల్ నజీర్ కలుగ జేసుకోవాలని జగన్ కోరారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గాలు చేస్తోన్న దాడులను, రాష్ట్రంలో పరిస్ధితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. రాష్ట్రపతి పాలన కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు సిద్ధమన్నారు.
వెంటనే ఇవన్నీ ఆపాలి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం నవాబ్‌పేటలో ప్రత్యర్థుల దాడిలో గాయపడి విజయవాడ సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు, డేరంగుల గోపి, దేవిశెట్టి రామకృష్ణలను జగన్ పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకుని, అక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయం మొదలైందని, దానికి చంద్రబాబు నాయుడు తెర తీశారన్న జగన్ ఆరోపించారు.
చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారన్నారు. దాడులతో ఏమి సాధిస్తున్నారో తెలియడం లేదని జగన్ పేర్కొన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో అదుపు చేయడం కష్టమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు.