Avinash Reddy PA Raghava Reddy Detained: చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనితతో పాటు షర్మిల, సునీత, విజయమ్మలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వెనకున్న కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కడప కోర్టు అనుమతితో వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలో విచారించి కీలక అంశాలు రాబట్టాలని పులివెందుల పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇదే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈనెల 9వ తేదీన విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
గడిచిన నాలుగేళ్ల నుంచి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి, అతని వెనకున్న వారిని గుర్తించడానికి పనిలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈమేరకు అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలో విచారించి నిజాలు వెలికి తీసే అవకాశం ఉంది. ఈనెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్రాను కస్టడీలో విచారించుకోవచ్చని కడప నాలుగవ అదనపు జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది.
కుట్రదారులను గుర్తించేందుకు: ఈమేరకు బుధవారం ఉదయం 9 గంటలకు వర్రాను కడప జైలు నుంచి పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. నవంబర్ 8న ఐటీ, బీఎన్ఎస్, అట్రాసిటీ చట్టాల కింద వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని నవంబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై జిల్లాలో పది కేసులు, రాష్ట్రవ్యాప్తంగా 40 కేసులు ఉన్నాయి. పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో 71 మందిని నిందితులుగా చేర్చారు.
వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సజ్జల భార్గవ్ రెడ్డి సూచనల మేరకు అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇతని వెనకున్న కుట్రదారులను గుర్తించేందుకు వర్రాను రెండు రోజుల పాటు కస్టడీలో విచారించే అవకాశం ఉంది. వర్రాను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.